English | Telugu

చివరి నిమిషంలో సంజయ్ ర్యాలీకి అనుమతి.. చార్మినార్ వద్ద టెన్షన్ టెన్షన్

హైదరాబాద్ లో సంభవించిన వరదలకు సాయం చేసే విషయంలో సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్‌తో చార్మినార్‌ వద్ద తీవ్ర టెన్షన్‌‌ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు సంజయ్ బైక్ ర్యాలీతో భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రానున్నారు. బీజేపీ లేఖ వల్లే వరద సాయం ఆగిపోయిందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరద సాయం ఆపాలని‌ తాను ఎటువంటి లేఖ రాయలేదని బండి‌ సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయంపై సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. ఈ లేఖ‌పై నిజానిజాలు తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ స‌వాల్ విసిరారు. ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు భాగ్య‌ల‌క్షి ఆల‌యం వ‌ద్ద‌కు వచ్చి ఇద్దరు ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్ కు స‌వాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు చివరి నిమిషంలో అనుమతినిచ్చారు. అయితే ఈరోజు శుక్ర‌వారం కావ‌డంతో పోలీసుల్లో కూడా టెన్ష‌న్ నెలకొంది.