English | Telugu
కర్నాటక సీఎం మార్పు.. అందరితోనూ చర్చించే నిర్ణయం.. ఖర్గే
Updated : Nov 27, 2025
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు పంచయతీ ఢిల్లీకి చేరింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాల సెగ హైకమాండ్ కు తగిలింది. దీంతో హైకమాండ్ కర్నాటక పార్టీలో విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టింది. కర్నాటక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎం మార్పు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఈ విషయంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. కర్నాటక పార్టీలో అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్ర నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గురువారం (నవంబర్ 27) తెలిపారు. అందరితో చర్చించి, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న తరువాత మాత్రమే సీఎం మార్పుపై ఒక నిర్ణయం తీసుకుంటామని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశంలో తాను, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సహా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పాల్గొంటారని స్పష్టత ఇచ్చారు.