English | Telugu

రాజ్యసభకు పరిమళ్ నత్వానీ ఎంపికతో ఏపీ లాభపడుతుందా?

రాజ్యసభ కు వై ఎస్ ఆర్ సి పి నుంచి ఓ గుజరాతి వాసి అయిన పరిమళ్ సత్వానీ ని జగన్ పంపడం వెనుక రహస్యం ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ కారిడార్స్ లో ప్రస్తుతం ఈ ప్రశ్న షికార్లు చేస్తోంది. ఏపి కి ప్రత్యేక హోదా - రాయితీలతో కూడిన విభజన హామీలకు, పోలవరం ప్రాజెక్ట్ కు, ప్రధానం గా కాకినాడ పెట్రో కెమికల్, కాస్మొటిక్ బారి ఇండస్ట్రీ కి , రామాయపట్నం మేజర్ పోర్ట్ కి, కడప ఉక్కు ఫ్యాక్టరీ కి, విశాఖపట్నం రైల్వే డివిజన్ తో కూడిన రైల్వే జోన్ కి, శ్రీకాకుళం, రాజమండ్రి, అనంతపురం ప్రాంతాలలో హై కోర్టు బెంచ్ లకి కేంద్ర ప్రభుత్వం నుండి నత్వానీ సాధించి పెట్టగలరా, అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏపిలో గల అపార గ్యాస్ నిక్షేపాలకు, చమురు సంపద దోపిడీలకు మరింత ప్రమాదం పొంచి వుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ వర్గాలు, పరిమళ్ నత్వానీ మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయం లో ఏ మేరకు నిబద్ధత తో వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నాయి.

ఏపి లో గల కోనసీమ నుండి వేల కోట్లు విలువ చేసే చమురు, గ్యాస్ నిక్షేపాలను అన్వేషణ కారణంగాను, నిత్యం ఆ నిక్షేపాలు రవాణా కారణంగా నష్టపోతూ ప్రమాదపు అంచులలో వున్న కోనసీమ ప్రాంత భద్రత కు, అభివృద్ధికి ఒక 1000 కోట్లు సహాయ నిధిని కేంద్రం నుండి, రిలయన్స్ సంస్థ నుంచి పరిమళ్ నత్వాన్నీ విడుదల చేయించగలరా, అని కూడా పొలిటికల్ కారిడార్లు ప్రశ్నిస్తున్నాయి.

చెన్నై కేంద్రం గా వున్న ఓ ఎన్ జీ సి ప్రధాన కార్యాలయాన్ని రాజమండ్రి ప్రాంతానికి తరలించ గలరా, చమురు, గ్యాస్ కాలుష్య భాదితులైన ఏపి ప్రజలకు వంట గ్యాస్ ధర 250 రూపాయలకే పంపిణి చేయించ గలరా అని కూడా రాజకీయ పార్టీలు పరిమళ్ నత్వానీ కి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క దానికైనా నత్వానీ ద్వారా ఏపి కి మేలు జరుగుతుందా, లేక వైసిపి పార్టీలో రాజ్యసభకు సమర్థులు లేరా అనే వాస్తవాన్ని అంగీకరించే విధంగా ఆ శ్రేణులు బహిరంగ ప్రకటన చేయగలరా అని మరి కొందరు సూటిగా పరిమళ్ నత్వానీ కి ప్రశ్నలు సంధిస్తున్నారు.