English | Telugu

వైజాగ్ లో విజ‌య‌సాయిరెడ్డి ప‌రువు నిల‌బ‌డుతుందా?

‘వైజాగ్‌’ మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. సిటీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన వారు. ఎమ్మెల్యేల‌కు స్థానికంగా గట్టి పట్టు వుంది. అయితే ఇక్కడ అధికార పార్టీకి విజయం అంత సులువేమీ కాదు. పాల‌నా రాజధానిని ఇక్కడకు తెస్తున్నామనే ప్రకటన, నవరత్నాలు తమకు ఓట్లు తెచ్చి పెడతాయని అధికారపార్టీ భావిస్తోంది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై నెల‌కొన్న అసంతృప్తి తమ విజయావకాశాల‌పై అనుమానాలు క‌ల్గిస్తున్నాయ‌ని స్వంత‌పార్టీ నేత‌లే చెపుతున్నారు. తీసేసిన పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, శానిటరీ వర్క్‌ర్ల జీతాలు పెంచకపోవడం, రేషన్‌కార్డుల‌ తొగింపు వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్ర‌తిప‌క్షం ఆశ పెట్టుకుంది.

టిడిపి సీనియర్‌ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెల‌గపూడి రామకృష్ణబాబు. పి.వి.వి.నాయుడు, గణేష్‌కుమార్‌ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్నారు. వీరి దూకుడుకు అడ్డుకట్టవేసే బాధ్యతను ‘విజయసాయిరెడ్డి’ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థును గెలిపిస్తే సి.ఎం. వద్ద ఆయన పరపతి మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే ఆయన పరువుపోవడం ఖాయం. పాల‌నా రాజధానిగా ‘విశాఖ’ను ప్రకటించిన తరువాత కూడా అక్కడ అధికారపార్టీ ఓడిపోతే ప్రతిపక్షం చెప్పినట్లు ‘విశాఖ’ పౌరులు అక్కడకు రాజధాని రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టం అవుతుంది.

గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది? రాజధానిని ‘అమరావతి’ నుంచి ‘విశాఖ’కు త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల‌ నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక్క‌డ జ‌రిగే ఎన్నిక‌ల్లో దాని ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని రాజ‌ధాని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని ప్రకటన రావడంతో ‘వైజాగ్‌’ ప్రజల్లోనూ ఆనందం కనిపించింది. అయితే ‘వైజాగ్‌’ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని, అక్కడ అభివృద్ధి జరిగితే చాల‌నే విధంగా ఉన్నారని ప్రతిపక్ష టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘వైజాగ్‌’ మున్సిపాల్టీకి జరుగుతున్న ఎన్నికల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తినెల‌కొంది.

వైకాపా స్థాపించిన దగ్గర నుంచి ‘వైజాగ్‌’ పట్టణం ఆ పార్టీకి క‌ల‌సి రావ‌డం లేదు. 2014లో పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌ స్వయంగా ‘విశాఖ’ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా భారీ స్థాయిలో 151 స్థానాలు గెలిచిన‌ప్ప‌ట్టికీ ‘వైజాగ్‌’ పట్టణంలో ఆ పార్టీకి మళ్లీ షాక్‌ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లో ఓడిపోయింది. ముక్కోణపు పోటీలో పార్టీ ఎంపీ విజయం సాధించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ‘మున్సిపల్‌’ ఎన్నికల్లో తమ సత్తా చాటి ‘వైజాగ్‌’లో జెండా పాతాల‌ని వైకాపా ఆశిస్తోంది. విజయసాయిరెడ్డి గత కొంత కాలంగా ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టిసారించి చక్రం తిప్పుతున్నారు. ‘వైజాగ్‌’ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. విశాఖ‌లో గెలిచి అధికార‌పార్టీ ప‌రువు కాపాడుకుంటుందా?