English | Telugu
నా రాష్ట్రానికి ఏమైంది..తెలుగోడి గోడు...
Updated : Mar 17, 2020
ఆంధ్రప్రదేశ్ లో సమీప భవిష్యత్తులో ఏం జరగబోతోంది? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెలు కులాల వారిగా చీలిపోనుందా? దశాబ్దాలుగా ప్రశాంతంగా, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఉన్న గ్రామాల ప్రజలు చలో సినిమాలోలా కంచెలు వేసుకు బతకాల్సిన పరిస్థితులు రానున్నాయా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ప్రతిఒక్కరి మెదడుని తొలుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కొన్ని విచిత్ర పరిస్తితులను గమనిస్తే పై ప్రశ్నలు నిజమయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ ముఖ్యమంత్రీ మాట్లాడని విధంగా జగన్ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం..రాజే మొదలు పెట్టాక అయన మెప్పు కోసం మంత్రులు, నాయకులు పోటీ పడి ఇష్టం వచ్చిన బాషలో ఒక రాజ్యంగ బద్ద పదవిలో ఉన్న అధికారిని కులం పేరుతో నానా దుర్భాషలాడటం ప్రజలంతా చూశారు.
అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు సాక్షాత్తు ఒక కులానికి చెందిన పెద్దల వ్యాఖ్యలతో నిట్టనిలువునా చీలి పోయే స్థితులు అనివార్యమయ్యాయి. మేము అధికారంలోకి వస్తే కులాలు చూడము, ప్రాంతాలు చూడము అని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే.. ఇవి ఎక్కడికి దారితీస్తాయోనని ప్రజలు భయం గుప్పిట చిక్కుకున్నారు. ప్రధానంగా పల్లెల్లో అధిక ప్రభావం చూపగల రెండు కులాల మద్య పెద్దలు సృష్టిస్తున్న విభేదాలు పరిస్తితులను నివుగప్పిన నిప్పులా మార్చాయని అంటున్నారు.
నిజానికి రెడ్డి కులానికి, కమ్మకులానికి మధ్య గొడవులు లేవు. ఆధిపత్య పోరు లేదు. ఒకవిధంగా రెండూ ఆధిపత్య కులాలే. 83 వరకు రెడ్లే ఎక్కువగా అధికారంలో ఉన్నారు. వారికి కమ్మ కులస్తులు సంపూర్ణ సహకారం అందించిన విషయం తెలిసిందే. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి. వీళ్ళలో ఎవరూ కమ్మ కులాన్ని వ్యతిరేకించలేదు. దానికి ముందే ముఖ్యమంత్రులైన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి. 90వ దశకంలో ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఇలా అందరూ ఆన్ని కులాలతో పాటుమరో ఆధిపత్య కులమైన కమ్మ కులాన్ని కూడా ఒకేలా చూశారు. కమ్మ కులస్తులు కూడా ఆయా ముఖ్యమంత్రులకు యధాశక్తి సహకరించారు.
1983లో కమ్మ కులస్తుడైన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయనకు అన్ని కులాలతో పాటు రెడ్డి కులస్తులు కూడా పూర్తి సహకారం అందించారు. ఎక్కడా కుల ప్రసక్తి రాలేదు. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే ఆత్మగౌరవ నినాదంతో కానీ కుల ప్రాతిపదికన కాదన్న విషయం తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలిసిందే. కానీ, వినాశనం , అధికారం అనే ఆలోచన తప్ప మరో ధ్యాస లేని ఒకే ఒక్క కుటుంబం పనిగట్టుకొని కమ్మ కులం మీద విషం చిమ్మటం మొదలు పెట్టిందని కొందరు అంటున్నారు. ఆ కుటుంబం మొదటి తరం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. కమ్మ కులాన్ని వ్యతిరేకించటం ఆయనకు దగ్గర కావటానికి ఒక సులువైన మార్గం అనేలా పరిస్థితి తయారయ్యింది. ఆయన కూడా అలాగే చేరదీశాడు. కేవలం రెడ్డి కులస్తులనే కాకుండా, మిగతా కులాలు కూడా కమ్మ కులాన్ని వ్యతిరేకించేలా ప్రోత్సహించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఆ కుటుంబం రెండో తరం అధికారంలోకి వచ్చాక, ఆ వ్యతిరేకత కాస్తా ద్వేషంగా మారే స్థాయికి తీసుకెళ్ళాడని, ఆ ద్వేషాన్ని బహిరంగంగానే ప్రోత్సహించాదాని, ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు. ఆయన ఆదరణ పొందటం కోసం రెడ్డి కులస్తులు కానివాళ్ళు కూడా కమ్మ కులాన్ని ద్వేషించటం, ఆ ద్వేషాన్ని ఆయన ప్రోత్సహిస్తుండటంతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కులాల కుంపటిలా తయారయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే ఒక కుటుంబం రెడ్డి, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టింది. కేవలం ఆ కుటుంబం వల్లే శతాబ్దాలుగా కలిసున్న ఈ రెండు కులాలు ఒకరినొకరు ద్వేషించుకోనే స్థాయికి వెళ్ళారని విశ్లేషిస్తున్నారు.
పల్లెల్లో ఈ రెండు కులాలకు వెన్ను దన్నుగా, అనుచరులగా ఉంటున్న వెనుకబడిన, దళిత కులాలను కూడా ఆ కుటుంబం ఎంత తెలివిగా వాడుకుంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు అనటంలో సందేహం లేదు. అందుకే వారు ఆధిపత్య కులానికి క్రైస్తవ ముసుగు వేసుకొని వారిని ఆకర్షించడమే కాకుండా, వారిలో మరో ఆధిపత్య కులమైన కమ్మ కులం పట్ల ద్వేషాన్ని వారిలో పెంచి పోషిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ దళితులు, వెనుకబడిన వర్గాల వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆధిపత్య కులాల పట్ల వెనుకబడిన వర్గాల, దళితులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. కానీ, ఒక ఆధిపత్య కులాన్ని మోస్తూ, మరో ఆధిపత్య కులాన్ని ద్వేషిస్తే అది వెనుకబడిన వర్గాలకు, దళితులకు ఏ విధంగా లాభం కలుగుతుందో వారే ఆలోచించుకోవాలని సామజిక విశ్లేషకులు అంటున్నారు. వెనుకబడిన వర్గాలకు, దళితులకు అధికారం రావాలా అంటే.. ఖచ్చితంగా రావాలి. కానీ, వారు తమ శక్తిని ఒక ఆధిపత్య కులాన్ని మోయటానికి, ఒక ఆధిపత్య కులాన్ని ద్వేషించటానికే పరిమితం అయితే వారు కేవలం ఆయుధాలుగానే మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. ఆ ఆయుధం ధరించిన ఒక ఆధిపత్య కులపోడు, మీ మీద అధికారం చెలాయిస్తూనే ఉంటాడు. ఈ కులాల కుమ్ములాటలో భాగం అయితే నష్టం తప్ప లాభం ఉండదన్నది సుస్పష్టం.
కేవలం ఒకే ఒక కుటుంబం ఒక పథకం ప్రకారం రెండు ఆధిపత్య కులాల మధ్య మంట పెట్టింది. సరిగ్గా గమనిస్తే, ఇప్పుడు వారే మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య అగ్గి రాజేశారు. ఈ మంట దావానలంలా వ్యాపించి ఎన్ని జీవితాలు ఛిద్రం అవుతాయోనని తరాలుగా రాజకీయాలు చూస్తున్న పెద్దలు, ఉజ్వల రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్న విజ్ఞులు ఆవేదన చెందుతున్నారు.