English | Telugu

సామాన్యుడిపై క‌రోనా చావుదెబ్బ‌!

ఆర్థిక వ్యవస్థకు క‌రోనా పెను సవాల్‌గా మారుతుందా? చైనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప‌త‌నం చేసిన 'కరోనా వైరస్' అక్కడితో ఆగకుండా ఇతర దేశాలకూ పాకి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకూ పెను సవాల్ విసురుతోంది. కరోనా వైరస్ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఎలా ఉండ‌బోతోంది. త‌ల‌చుకుంటేనే వ‌ణుకు పుడుతోంద‌ని సామాజిక విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌ట్టికే ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశీయ వాహన రంగం కొంతకాలంగా నిస్తేజంగా ఉంది. సగటు భారతీయుడి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.

మన దేశం చాలా ఉత్పత్తుల విషయంలో చైనాపైనే ఆధారపడి ఉంది. అక్కడ పలు రంగాల్లో ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చైనా చతికిలపడితే మన ప‌రిస్థితి ఏమిటి?

మన దేశం దిగుమతి చేసుకుని టాప్ 20 ఉత్పత్తుల్లో అధిక భాగం చైనా నుంచే వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగం విషయానికొస్తే 45 శాతం ఉత్పత్తులు చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఆర్గానిక్ కెమికల్స్ కూడా 60 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఇక ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగించే ముడి వస్తువులు 70 శాతం చైనా నుంచి దిగుమతి అవాల్సిందే. అలాగే వాహన రంగంలోనూ 25 శాతానికిపైగా మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇది వాస్త‌వ ప‌రిస్థితి.

క‌రోనా దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు 156 బిలియన్ల నష్టం వాటిల్లిందని, ఇది గ్లోబల్‌ జీడీపీలో 0.2 శాతానికి సమానమని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఏడీబీ తెలిపింది. కరోనా కారణంగా ఒక్క చైనాకే 103 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఈ నష్టం విలువ ఆ దేశ జీడీపీలో 0.8 శాతానికి సమానం. మిగతా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లిన నష్టం విలువ 22 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఏడీబీ ఏసియా దేశాలకు 40 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఏడాది ఏసియా పసిఫిక్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు 21,100 కోట్ల డాలర్లు నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ ఏజెన్సీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. చైనా గ్రోత్‌రేటుపై 3 శాతం వరకు ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.

కరోనా కార‌ణంగా ఇండియా టూరిజం సెక్టార్‌ నష్టం 84.2 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.623 కోట్లు) వరకు ఉండొచ్చని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌(ఏడీబీ) తెలిపింది. పరిస్థితులు మరింత విషమిస్తే నష్టం 252 మిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని చెబుతోంది.

చైనాలో ఏర్ప‌డిన సంక్షేభంతో మన దేశంలోని షిప్పింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ తదితర రంగాలన్నీ కుదేలయ్యాయి. కారణం వాటికి అవసరమయ్యే ముడిసరుకులు, దిగుమతులు చైనా నుంచి తగ్గిపోవడమే. దీంతో మన ఫార్మా రంగంలో ఉత్పత్తి, సరఫరాలకు సంబంధించి తీవ్ర కొరత ఏర్పడింది. మన దేశంలో మందుల తయారీలో ఉపయోగంచే ముడిసరుకులు అంటే ఏపీఐలు, బల్క్ డ్రగ్స్‌ చాలావరకు చైనా నుంచే దిగుమతి అవుతాయి.

ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం క‌న్పిస్తోంది. ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది ఆదాయం దారుణంగా ప‌డిపోయింది. రోజు సంపాదించుకుని తినే వారి ప‌రిస్థితి అయితే ద‌య‌నీయంగా త‌యారైంది. క‌రోనా సోక‌క‌పోయినా క‌రోనా సెగ‌కి ఎంత మంది బ‌లి అవ్వాల్సి వుందో.