English | Telugu

తెలంగాణ అసెంబ్లీలో హైఓల్టేజ్ వార్... కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఒక ప్రాంతానికా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరూ మాటకు మాట అనుకున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావంటే... నువ్వేం మాట్లాడుతున్నావంటూ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో శాసనసభలో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతుండగా ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. గవర్నర్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పించారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 100మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విర్రవీగొద్దన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక సదుపాయల్లేవని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లేనా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతేంటి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంటింటికీ నీళ్లు ఎప్పుడిస్తారు? అంటూ నిలదీశారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామంటే... ముఖ్యమంత్రి, మంత్రులు సెక్రటేరియట్ లోనే ఉండరని మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు పెట్టడం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికా? అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చారు.

అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి అసలు ప్రజల్లో తిరుగుతున్నాడా? లేక రోడ్లపై తిరుగుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. ఏదైనా మాట్లాడితే అర్ధంపర్థం ఉండాలన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ జిల్లాకు రమ్మంటే ఆ జిల్లాకు వస్తానన్న ఎర్రబెల్లి... ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో స్వయంగా మాట్లాడి తెలుసుకుందా పదా అంటూ సవాలు విసిరారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పరుగెత్తిచ్చి కొడతారంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై అంతే సీరియస్ గా రియాక్టయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఘాటు కామెంట్స్ చేశారు. ఇది ఎర్రబెల్లి తప్పు కాదు... తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లిలాంటి తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడంతో అధికార టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కల్పించుకోవడంతో ఇరువర్గాలు శాంతించాయి.