English | Telugu

తమ్ముడు దాడి.. అన్నయ్య సర్దుబాటు...

ఒక్కో ఘటన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన గోదావరి జిల్లాల్లో ప్రముఖ జర్నలిస్టు.. ఆషామాషీ జర్నలిస్టు మాత్రమే కాదు.. జగమెరిగిన జర్నలిస్టు నేత.. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ జర్నలిజాన్ని సామాజిక వర్గ ప్రయోజనాల పరిరక్షణకు విచ్చలవిడిగా వాడేసిన ప్రముఖుడు ఆయన. నిన్న మొన్నటి వరకు ఎక్కడ జర్నలిస్టుపై దాడి జరిగినా నేనున్నానంటూ తీవ్రంగా ఖండించే నేత ఆయన. కానీ ఆయన పైనే రాజకీయ ప్రముఖులు, అందునా తన సామాజిక వర్గం నుండే వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు దాడి చేస్తే కిక్కురుమనకుండా అన్నీ మూసుకుని కూర్చోవలసి వస్తోంది. శ్రీరామచంద్రా ఏమిటో ఈ దుస్థితి.

ఇంతకూ విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బయలుదేరి వెళ్ళారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు శత విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారు. లోకేష్ కాన్వాయ్ అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆందోళన జర్నలిస్టులపైకి మళ్ళింది. లోకేష్ పర్యటన కవరేజి నిమిత్తం వెళ్లిన ప్రముఖ జర్నలిస్టులపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీకీ చెందిన మద్దతుదారులు ఈ విషయం గమనించి తీవ్రంగా ప్రతిఘటించారు. కాతేరు వద్ద జరిగిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన హెచ్ఎంటీవీ శ్రీరామ్ మూర్తి, టీవీ9 సత్య, మహా న్యూస్ సతీష్ పై వైకాపా కార్యకర్తల దాడి చేశారు. ఇంత దాడి జరిగితే మరుసటి రోజు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి సర్దుబాటు చేసేశారు. తమ్ముడు దాడి చేస్తే అన్న సర్దుబాటు చేస్తారు. దాడికి గురయిన వారిలో ఒక్కరు కూడా ఇదేమీటో తెలియజేయలేని పరిస్థితి.