English | Telugu
విశాఖ వాసుల ప్రాణాలతో చెలగాటం.. ఇంకెంత కాలం ఈ నిర్లక్ష్యం?
Updated : May 16, 2020
విశాఖ జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన కంపెనీలలో హెచ్‌పీసీఎల్ ఒకటి. ఇక్కడ ఎల్‌పీజీ గ్యాస్, క్రూడాయల్ నిల్వలు లక్షల టన్నుల్లో ఉంటాయి. 1997లో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకులు పేలడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఆ తరువాత కూడా ఈ సంస్థలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ పెద్ద ప్రమాదం జరిగితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది.
కోరమండల్ సంస్థ రసాయన ఎరువులు తయారుచేస్తోంది. ఇక్కడ ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్‌ను పెద్దమొత్తంలో నిల్వ చేస్తారు. ఈ రసాయనాల ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.
విశాఖ పోర్టు వల్ల కూడా ప్రజలు కాలుష్యం బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోర్టు పరిసరాల్లో నిల్వ చేస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, బొగ్గు నుంచి వచ్చే ధూళి వలన పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. దేశంలో మిగతా పోర్టులు దిగుమతి చేసుకోని ప్రమాదకర రసాయనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. స్టైరిన్, అమ్మోనియం నైట్రేట్, బొగ్గు, సల్ఫర్.. ఇలా అనేక రసాయనాలు లక్షల టన్నుల్లో ఇక్కడ నిల్వ చేస్తున్నారు. అవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు.
విశాఖ చుట్టుపక్కల గల ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలుతుంటాయి. అందులో రసాయనాలు సిబ్బందిపై పడి ఆసుపత్రి పాలవుతుంటారు. ఇక, పరవాడలోని ఎన్‌టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిద పిట్టవానిపాలేన్ని పూర్తిగా కలుషితం చేసింది.
పరిశ్రమలు, పోర్టులు ఉండటం సహజమే. కానీ, అవి సరైన జాగ్రత్తలు పాటించేలా చేసి, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దశాబ్దాలుగా పరిశ్రమలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజల ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా ఉండట్లేదు. ప్రమాదం జరిగిన తర్వాత నష్ట పరిహారం చెల్లించే కంటే.. అసలు ప్రమాదమే జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.