English | Telugu

విశాఖ రాజధాని ప్రతిపాదన ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్ లోకే !

ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన లేనట్టే. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన 75 జిల్లాల్లో , విశాఖపట్నం కూడా ఉన్నందువల్ల, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే . ఇహ, ఉద్యోగులు కూడా ప్రస్తుతానికి ఆ ఆలోచన గురించి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌)గా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విశాఖపట్నానికి తరలేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. మే నెలాఖరు నాటికి విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు.అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం కిందట నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయం విశాఖపట్నానికి తరలనుండడంతో ఉద్యోగులూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది.
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ ఉద్యోగులందరూ విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సంబంధిత ఉత్తర్వులు మే నెలాఖరులోపు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి రావచ్చని చెప్పారు. అమరావతి సచివాలయంలో అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాథమిక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో బిల్లులు పాస్‌ కాకపోవడం, కోర్టు కారణాల వల్ల వీటిపై ఉత్తర్వులు రాలేదు. మూడు రాజధానులు అంశం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగులంతా రానున్న విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు అడ్మిషన్లు ఎక్కడ తీసుకోవాలంటూ పలు రకాల ప్రశ్నలు అడగడంతో వీటిపై వివరణ ఇచ్చేందుకు అప్సా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాం. ఏ క్షణంలోనైనా విశాఖకు తరలి వెళ్లాలనే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడతాయని.. దీనికి ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సమావేశంలో స్పష్టతనిచ్చాం.’ అని తెలిపారు. 100-200 మంది గుమికూడితేనే కరోనా వస్తుందని అంటున్నారని.. ఉద్యోగులు వేల సంఖ్యలో ఉన్నందునే జనరల్‌ బాడీ నిర్వహించలేదని ఆయన చెప్పారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని, స్పష్టత ఇచ్చాక ఏప్రిల్‌ మొదటి వారంలో అప్సా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అయితే, ఇది ఇప్పటికి వాయిదా పడే అంశం గానే కనిపిస్తోంది.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ఉద్యోగులను విశాఖకు తరలించాల్సి వస్తే..చదువుకునే పిల్లలు ఎంత మంది ఉద్యోగులకు ఉన్నారో అటువంటివారందరికీ తరలింపులో మినహాయింపు ఇవ్వాలని కోరతామని వెంకటరామి రెడ్డి చెప్పినప్పటికీ, ఇపుడు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదనేది ఉద్యోగులు, అధికారుల వాదన. అయితే, ఇదంతాకూడా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించాక ముందు పరిస్థితి. తాజా గా కరోనా వైరస్ నేపధ్యం లో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 75 జిల్లాల లాక్ డౌన్ కారణంగా- ప్రస్తుతం విశాఖ లో కార్య నిర్వాహక ప్రతిపాదన ఇప్పటికైతే వెనక్కు వెళ్ళినట్టే !