English | Telugu

ఇంత దీనపు పలుకులు ఏమిటి?.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ ప్రజాచైతన్యయాత్రలో భాగంగా విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. కుప్పం వెళ్లి అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వాపోయారని, పేద వాళ్లకు తిండి దొరకకుండా చేశామని చంద్రబాబు చెబుతున్నారని, 9 సార్లు ఆయన్ను గెలిపించిన కుప్పం ప్రజలు ఇంకా ఐదు రూపాయల భోజనం కోసం ఎదురుచూస్తుండటమేమిటని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇంత దీనపు పలుకులేమిటని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

జగన్ నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని, మీరు అధికారంలో ఉంటే 15% అంచనాల పెంపు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవారని సాయిరెడ్డి తన ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా మీది అంటూ చంద్రబాబునుద్దేశించి విజయసాయి వ్యాఖ్యానించారు..చివరిగా ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.