English | Telugu
అమరావతిపై టీడీపీ కొత్త ప్లాన్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయసేకరణ
Updated : Feb 26, 2020
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి ఇప్పటివరకూ ఆందోళనలు సాగిస్తున్న టీడీపీ తాజాగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన టీడీపీ వైసీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతోంది. ఎలాగో ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి అందులో భాగంగానే మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని భావిస్తోంది...
మూడు రాజదానుల నిర్ణయంతో ప్రజలను సీఎం జగన్ అయోమయంలోకి నెట్టారని, తన స్వార్ధం కోసమే విశాఖను రాజధానిని ఎంచుకున్నారు తప్ప అక్కడ అభివృద్ధి చేసే ఉద్దేశం ఆయనకు లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించామని, అందులో భాగంగానే రేపటి నుంచి జరగబోయే యాత్రలో ప్రజాభీష్టమేమిటో తెలుసుకుంటామని రవీంద్ర వివరించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తామని, జగన్ అమరావతి కేంద్రంగా చేస్తున్న అల్లరిని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామన్నారు.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతిపై జగన్ తన అక్కసును వెళ్లగక్కుతుంటే కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. కేంద్రం ఇప్పటికైనా జగన్ నిర్ణయంపై తన అభిప్రాయమేంటో స్పష్టంగా చెప్పాలన్నారు. అమరావతిలోని 132 సంస్ధలను తరిమేస్తున్న జగన్ విశాఖను అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మే స్ధితిలో లేరని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉండే పేదల కోసం గత ప్రభుత్వం 5 వేల ఇళ్లను నిర్మించిందని, వాటిని గాలికొదిలేసి మళ్లీ పేదలకు రాజధానిలో భూములు కేటాయిస్తామనడం విడ్డూరమన్నారు.