English | Telugu
వైఎస్సార్ పై వీహెచ్ సంచలనం! పీజేఆర్ ను వదిలేయమని ఆఫర్
Updated : Dec 28, 2020
దివంగత మాజీ మంత్రి పీజేఆర్ గురించి ప్రస్తావన తెస్తూ వైఎస్‌పై వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్‌కు తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని అప్పట్లో వైఎస్ ప్రయత్నాలు చేశారని చెప్పారు వీహెచ్. అంతేకాదు పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని వైఎస్ తనకు ఆఫర్ చేశారని తెలిపారు. అయితే వైఎస్సార్ ఆఫర్‌ను తాను తిరస్కరించానని.. ఒకవేళ అప్పట్లో వైఎస్ ఆఫర్‌ను అంగీకరించి ఉంటే తాను ఎంతో సంపాందించేవాడినని చెప్పారు హనుమంతరావు.
కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఇవాళే పీజేఆర్ వర్ధంతి కూడా కావడంతో .. ఆ సమావేశంలో ఆయన గురించి పలు వ్యాఖ్యలు చేశారు వీహెచ్. కాంగ్రెస్ ఉన్నంత కాలం పీజేఆర్‌ను ప్రజలు మరువరని తెలిపారు. తాగునీటి కోసం పోరాటం చేశారని, ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇప్పించారని చెప్పారు. తెలంగాణ కోసం మొదట పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని వీహెచ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ గురించి వీహెచ్ చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఆఫర్ల ద్వారానే వైఎస్సార్ తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.