English | Telugu
ఎమ్మార్వో హత్య వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం!!.. తీగ లాగితే?
Updated : Nov 5, 2019
పట్టపగలు తన ఆఫీసులోనే ఎమ్మార్వో విజయారెడ్డి అగ్నికి ఆహుతి కావడం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సురేష్ అనే ఓ సాధారణ వ్యక్తి పట్టపగలు ఆఫీస్ కి వెళ్లి ఎమ్మార్వోని హత్య చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను హత్య చేసానని సురేష్ చెప్తున్నప్పటికీ.. ఈ హత్య వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాను చెప్పిన పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని.. అయినా ఎమ్మార్వో వినలేదన్న కోపంతో చంపే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు ముందు స్థానిక ఎమ్మెల్యే ఇదే విషయమై అనేక సార్లు ఒత్తిడి తెచ్చారని, కానీ ఈ భూమి వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎమ్మార్వో ఆ సాహసం చేయలేకపోయారని చర్చ సాగుతోంది.
ఇదే విషయంపై ఇద్దరు స్థానికులు మాట్లాడుకుంటున్న ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోన్ సంభాషణ ప్రకారం.. ఎమ్మార్వో హత్య కేసులో టీఆరెఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూముల పాత పంచాయితీల్లో ఎమ్మెల్యే వేలు పెట్టారని, తాను పరిష్కారం చూపిస్తానని.. 30లక్షలు వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం 412 ఎకారాల భూమి ఎప్పటి నుండో వివాదాల్లో ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివాదానికి పరిష్కారం చూపిస్తానని రైతుల దగ్గర నుండి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారని, సురేష్ నుండి కూడా 3లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పని కాకపోవటంతో కొంతమేర తిరిగి ఇచ్చి, మిగతా సొమ్ము ఎమ్మెల్యే ఇవ్వలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
భూమి వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చినా ఎమ్మార్వో అంగీకరించలేదు. దీంతో సురేష్ కూడా ప్రత్యక్షంగా ఎమ్మార్వో మీద ఒత్తిడి తెచ్చాడని అంటున్నారు. ఒత్తిడి తెస్తున్నా, ఎమ్మార్వో మాట వినడం లేదని.. అందుకే బెదిరించే ఉద్దేశంతో సురేష్ పెట్రోల్ పోసి ఉంటాడని, కానీ అది హత్యకు దారి తీస్తుందని ఊహించి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మరి సురేష్ నిజంగానే బెదిరించే ఉద్దేశంతోనే పెట్రోల్ పోశాడా? లేక నిజంగానే హత్య చేయాలనే ఉద్దేశంతోనే పోశాడా?. ఒకవేళ హత్య చేయాలనే ఉద్దేశంతో పోస్తే అసలు అతనికి అంత ధైర్యం ఎక్కడిది? నిజంగానే అతని వెనుక రాజకీయ శక్తుల ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి కూడా ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నా భార్య మృతికి సురేష్ ఒక్కడే కారణం కాదని.. అతని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, వారెవరో తేలాలంటే.. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసారు. విపక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ కార్యాలయంలోనే సజీవ దహనం చేసిన ఘటనను సీరీయస్‌గా తీసుకొని.. కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయించి నిందితులకు శిక్ష పడేలా చేస్తుందేమో చూడాలి.