English | Telugu
ఆసక్తితో చేరా... ఆవేదనతో వీడుతున్నా... ఓ కానిస్టేబుల్ వ్యథ..!
Updated : Nov 5, 2019
ఒకప్పుడు పోలీస్ శాఖలో ఉద్యోగమంటే పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు... దాంతో, కిందిస్థాయి ఉద్యోగుల ఎంపికకు అసలు పరీక్షలే ఉండేవి కాదు... ఒకచోట అడ్డంగా ఒక తాడు కట్టి... దాని కింద నుంచి పంపేవారు. ఎవరి తల అయితే ఆ తాడుకి తగులుతుందో... వాళ్లను కానిస్టేబుల్స్ గా ఎంపిక చేసేవారు. అంటే, ఒక మోస్తరు ఎత్తు ఉంటే చాలు కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిపోయేవారు... కానీ రోజులు మారాయి... పెద్దపెద్ద చదువులు చదివినా... ఉద్యోగాలు, ఉపాధి దొరకని పరిస్థితి వచ్చింది... దాంతో, బీటెక్ లు, ఎంటెక్ లు, ఎంఏ, ఎమ్మెస్సీ... ఇలా డిగ్రీ, పీజీ, ఆపై చదువులు చదివిన వాళ్లంతా... కానిస్టేబుల్, హోంగార్డుల ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. కేవలం టెన్త్ అండ్ ఇంటర్ మాత్రమే కనీస అర్హతతో భర్తీ చేసే కానిస్టేబుల్ పోస్టులకు ఉన్నత చదువులు చదివినవాళ్లంతా పోటీపడుతుండటంతో... ఉద్యోగాలకు దాదాపు వాళ్లే ఎంపికవుతున్నారు. అయితే, కానిస్టేబుల్, హోంగార్డులంటే ప్రజల్లోనే కాదు... పోలీస్ శాఖలోనే చిన్నచూపు ఉందని, ఉన్నతాధికారులు వాళ్లను కనీసం ఉద్యోగులుగానే గుర్తించరనే అపవాదు ఉంది. కానిస్టేబుల్స్, హోంగార్డులకు అంటే కనీస గౌరవం ఇవ్వరని... ఎస్సై నుంచి ఆపై స్థాయి అధికారులంతా... వాళ్లను చిన్నచూపు చూస్తారని అంటారు. కానిస్టేబుల్స్, హోంగార్డుల చేత ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయించుకున్న ఘటనలు ఎన్నో బయటపడ్డాయి.
ఇక, విధి నిర్వహణలోనూ కానిస్టేబుల్స్ దే కీలక పాత్ర. గ్రౌండ్ లెవల్ లో చెమటోడ్చిది వాళ్లే. బందోబస్తులైనా... ఇంకేదైనా కానిస్టేబుల్స్ లేకపోతే ఏ పనీ జరగదూ... అసలు కానిస్టేబుల్స్ లేకుండా పోలీస్ శాఖను ఊహించుకోవడం కష్టమే. అంతటి కష్టాన్ని, శ్రమను భరిస్తూ వేళాపాళాలేని టైమింగ్స్ తో విధులు నిర్వర్తించే తమకు కనీస గుర్తింపు దక్కడం లేదని కానిస్టేబుల్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ జీవితాలు మాత్రం మారడం లేదని అంటున్నారు. కానిస్టేబుల్ గా చేరి... చివరికి కానిస్టేబుల్ గానే పదవీ విరమణ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మిగతా శాఖల్లో కనీసం అటెండర్ గా ఉద్యోగంలో చేరినా... అతడు పదవీ విరమణ చేసే సమయానికి మంచి పొజీషన్ లో ఉంటాడని, కానీ పోలీస్ శాఖలోని కానిస్టేబుల్స్ కు ఎదుగుబొదుగూ లేదంటున్నారు. ఎస్సైలకు కనీసం పదేళ్లకే ప్రమోషన్ లభిస్తుంటే... కానిస్టేబుల్స్ మాత్రం వాళ్ల మొత్తం సర్వీసులో ఒక్క పదోన్నతి కూడా లేకుండా పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ఉన్నత విద్యావంతులు... ఉద్యోగం కోసం కానిస్టేబుల్స్ గా చేరినా... ఆ తర్వాత ఎదురవుతున్న చిన్నచూపు, చీత్కారాలతో పునరాలోచనలో పడుతున్నారు. తాజాగా ఒక కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది. అతడు రాసిన లేఖ ఇలాగుంది... నా పేరు ప్రతాప్... ఇంజనీరింగ్ పూర్తిచేసి 2014లో కానిస్టేబుల్(పీసీ నెం 5662)గా ఎంపికై చార్మినార్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా... పోలీస్ శాఖపై అమితాసక్తితో అడుగుపెట్టిన నేను నా విధుల్ని త్రికరణ శుద్ధితో నిర్వర్తించా... అనేకసార్లు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నా... అయితే, నా వయసు 29ఏళ్లు కావడంతో నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు... కానీ, నేను కానిస్టేబుల్ అని తెలియడంతో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే, ఓ యువతి నన్ను తిరస్కరించడానికి కారణాలేంటని ఆరా తీసినప్పుడు... ఆమె చెప్పిన కారణాలు నిజమేననిపించింది... కానిస్టేబుళ్లు 24గంటలూ గొడ్డుచాకిరి చేస్తారని, వాళ్లకసలు కనీస గౌరవం ఉండదని, అసలా ఉద్యోగంలో ఎదుగుబొదుగూ ఉండదని, కానిస్టేబుల్ గానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చిందని... అయితే ఆమె చెప్పిన కారణాలన్నీ నిజమే కావడంతో తాను తీవ్రంగా మనస్తాపం చెందటంతోపాటు... నా ఉద్యోగం పట్ల డిప్రెస్ ను గురయ్యానని... నా సీనియర్లు 35ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తున్నా... కానిస్టేబుల్ గా పదవీ విరమణ చేయడాన్ని తాను గుర్తించానని... అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశాడు. దాంతో, కానిస్టేబుల్ ప్రతాప్ రాజీనామాను ఆమోదిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీవో నెం.9583/2019 జారీ చేశారు.
అయితే, కానిస్టేబుల్ ప్రతాప్ రాజీనామాపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇబ్బందులున్న మాట నిజమేనని, ఎక్కువమంది కానిస్టేబుల్స్ గానే రిటైర్ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు. కానిస్టేబుల్స్ లో చాలా మంది లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నా... పదోన్నతులు మాత్రం లభించడం లేదని అంటున్నారు. అయితే, దీనికి కారణం... ఎస్సై... ఆపై పోస్టులు తక్కువగా భర్తీ కావడం... కానిస్టేబుల్స్ మాత్రం వేలల్లో రిక్రూట్ కావడమే ప్రధాన కారణమని అంటున్నారు.