English | Telugu
యూట్యూబ్ దెబ్బకి ఐసీయూ లోకి పోయిన టిక్‌టాక్
Updated : May 20, 2020
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్' బాగా ట్రెండ్ అవుతోంది. నెట్టింట ఈ ఫైట్ హోరాహోరీగా సాగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ యూట్యూబ్‌దే పైచేయి అని చెప్పొచ్చు. ఎందుకంటే, యూట్యూబ్ దెబ్బకి.. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ యాప్ రేటింగ్ కలలో కూడా ఊహించని స్థాయికి దిగజారిగింది.
ఎల్విష్ యాదవ్ అనే యూట్యూబర్ టిక్‌టాక్ యూజర్లను చెత్తతో పోలుస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియో బాగా వైరలైంది. ఆ వీడియో చూసి బీపీ తెచ్చుకున్న అమీర్ సిద్ధిఖీ అనే టిక్‌టాక్ యూజర్.. యూట్యూబర్లకు ఏదీ చేత కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది విన్నాక యూట్యూబర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టిక్‌టాకర్ల పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే, చెడుగుడు ఆడేసుకున్నారు.
ఇక స్టార్ యూట్యూబర్ క్యారీమినటీ మే 8న "యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్" పేరిట అప్‌లోడ్ చేసిన రోస్టింగ్ వీడియోకు వచ్చిన వ్యూస్, లైకులు, కామెంట్లు ప్రతీది రికార్డే. అయితే ఏమైందో ఏమో కానీ, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఆ వీడియో మే 14 నుంచి యూట్యూబ్‌లో కనిపించకుండా పోయింది. ఊహించని పరిణామంతో క్యారీమినటి కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసిన అతని భారత యూట్యూబ్ అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. క్యారీమినటి వీడియో డిలీట్ చేయడానికి కారణమైన టిక్‌టాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియాలో మంగమ్మ శఫథం చేశారు. టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చీప్ రేటింగ్ ఇచ్చి డిలీట్ చేయాలని ఓ ఉద్యమమే నడిపారు. దీంతో 4.6తో టాప్‌లో ఉన్న టిక్‌టాక్ రేటింగ్ ఇప్పుడు 1.3 కి దిగజారిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత పాతాళానికి పడిపోయే అవకాశమూ ఉంది. మొత్తానికి, ఈ దెబ్బకు ఐసీయూ లోకి పోయినట్లున్న టిక్‌టాక్.. ఈ విపత్తు నుంచి ఎలా కోలుకుంటుందో?, అసలు కోలుకుంటుందో లేదో చూడాలి.