English | Telugu
'మూడు రాజధానులు వద్దు మహాప్రభో' అంటున్న ప్రజలు!!
Updated : Feb 7, 2020
దాదాపు రెండు నెలలుగా ఏపీలో రాజధాని రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతి సరైన ఎంపిక కాదని, గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతిలో రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్లు కావాలని... ఇలా రకరకాల కారణాలు చెప్పి.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. అయితే, సీఎం జగన్ ఈ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన దగ్గర నుంచి తీవ్రవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా, జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనకడుగు వేసేది లేదంటోంది.
ఇదిలా ఉంటే ఏపీ రాజధాని వివాదం జాతీయ స్థాయిలో కూడా హాట్ టాపిక్ గా మారింది. పలు మీడియా సంస్థలు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై ‘ది హిందూ బిజినెస్ లైన్’ అనే ఆంగ్ల వెబ్‌సైట్ సర్వే చేపట్టింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తెలివైనదేనా? అని సర్వే చేపట్టగా.. ఇప్పటివరకు 3,20,351 మంది దీనిపై స్పందించారు. వీరిలో 83 శాతం మంది ప్రజలు జగన్ నిర్ణయం తెలివైనది కాదని తేల్చి చెప్పారు. కేవలం 17 శాతం మంది మాత్రమే జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీన్నిబట్టి చూస్తుంటే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని అర్ధమవుతోంది.