English | Telugu

రైతుల నుండి హమాలి చార్జీలు వసూలు చేయడం ఆపాలి!

తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్లో వరి ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు జరుగుతున్నది. సహకార సంఘాలు ,ఐకెపి కేంద్రాల్లో రైతుల నుండి వసూలు చేస్తున్న హమాలి చార్జీలను ఆపాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రైతుల నుండి హమాలి ఛార్జీల పేరుతో క్వింటాలుకు రూ!! 35 నుండి 40 వసూలు చేస్తున్నారు. పురి కొనలు కూడా రైతులే తీసుకు రావాలని చెబుతున్నారు.

ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కోటి అయిదు లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అకాల వర్షాలు, వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులకు హమాలి ఛార్జీలు అదనపు భారమే అవుతుంది.

కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని హమాలి చార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నాము. గతంలో హమాలి చార్జీలు ప్రభుత్వం సకాలంలో ఐకెపి కేంద్రాలు, సహకార సంఘాలకు చెల్లించకపోవడం వల్ల రైతుల నుండి వసూలు చేస్తున్నామని కొనుగోలు కేంద్రాల వారు రైతులకు తెలియజేస్తున్నారు. గత బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది.