English | Telugu

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం.. త్వరలో పదవుల భర్తీ!!

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి సమయం దగ్గర పడింది. త్వరలో పార్టీ అధ్యక్షుడ్ని మారుస్తారని ప్రచారం జరుగుతుంది. అంతకుముందే అనుబంధ విభాగాల్లో భర్తీ చేపట్టాలని నేతలు నిర్ణయించారు. ఇందు కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధిష్టానం నుండి దూతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ మధ్యనే రెండుసార్లు గాంధీ భవన్ వేదికగా వివిధ అనుబంధ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులు, చైర్మన్లు, ఇన్ చార్జిలను నియమించేందుకు జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు. ప్రధానమైన విభాగాలకు తీవ్ర పోటీ ఉంది. ఏఐసీసీ నుంచి వచ్చిన నేతలు.. పీసీసీ అధ్యక్షుడు పార్టీ జనరల్ సెక్రెటరీల అభిప్రాయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. దీంతో పార్టీకి కీలకంగా భావించే కమిటీల్లో అవకాశం కోసం క్యాడర్ ఎవరికి వారు తమ పద్ధతులు పైరవీలు ముమ్మరం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నేతలను కలుస్తూ ఈ సారి తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ఆశావహులు.

ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు గాంధీ భవన్ లో ఆయా అనుబంధ సంఘాల ఆశావహులతో భేటీ అయ్యారు. వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో ఒక్క ఎస్సీ సేల్ కు ఇరవై మందికి పైగా పోటిపడుతున్నారు. ఈ పదవికి మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్, సతీష్ మాదిగ, మానవతారాయ్, మేడిపల్లి సత్యంలు ఉన్నారు. మిగితా కమిటీల్లో కూడా నియామకం చేపట్టేందుకు కొందరు సీనియర్ లీడర్లను సామాజిక సమన్వయ సమావేశం పేరుతో ఢిల్లీకి పిలిపించి చర్చించారు అధిష్టానం పెద్దలు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పిసిసి కమిటీలు ప్రధానమైనవిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఇందు కోసం సమర్థవంతంగా పని చేసే వాళ్లు పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక మహిళా కాంగ్రెస్ లో ప్రస్తుతమున్న నేరేళ్ల శారద తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ఇందిరా శోభన్, రజినీరావు, సుజాత గుప్తాలకు కూడా తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. బీసీ సెల్ ఛైర్మన్ గా పలువురు మాజీ శాసన సభ్యుడు సీనియర్లు పోటీ పడుతూ ఉంటే ప్రస్తుతమున్న కత్తి వెంకట స్వామి తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. బెల్లయ్య నాయక్, రాములు నాయక్, ఫహీం వంటి వారు కూడా ఆయా విభాగాల్లోని అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ పటిష్టత కోసం ముందుగా అనుబంధ కమిటీలు పూర్తి చేసి తర్వాత పీసీసీ పదవులు నింపుతారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఆ తరువాతనే పిసిసి చీఫ్ ను మారుస్తాననే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుంది.