English | Telugu

ప్ర‌గ‌తిప‌థంలో తెలంగాణ.. సంక్షేమ‌రంగానికే ప్రాధాన్య‌త‌!

గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగం

తెలంగాణా శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్‌ తన ప్రసంగాన్ని చదివి వినిపించారు.

పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని, సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు భద్రత కల్పించాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60 వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు. పట్టణాల్లో రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచింది. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో తక్కువ వేతనంతో పని చేస్తున్న ఉద్యోగులు కూడా సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులయ్యారని తమిళిసై తెలిపారు.

గతంలో రేషన్‌షాపు ద్వారా ఒక్కొక్కరికీ 4 కిలోల బియ్యం ఇస్తే, ఇప్పుడేమో 6 కిలోలకు పెంచామ‌ని ఆమె చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేపపిల్లలను ప్రభుత్వం వదిలిందని గవర్నర్‌ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నడుపుతున్నామ‌న్నారు. విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసిందన్నారు. వివిధ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తుందన్నారు. డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాదబీమాను ప్రభుత్వం కల్పించిందని గవర్నర్‌ తెలిపారు.

పూజారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తోందని గవర్నర్‌ స్పష్టం చేశారు. మసీదుల్లో ఉండే ఇమామ్‌, మౌజమ్‌లకు నెలకు రూ. 5 వేల చొప్పున భృతి అందిస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోందని తమిళిసై తెలిపారు. పోలీసు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. హోంగార్డులకు దేశంలో ఎక్కడా లేనంత వేతనం తెలంగాణలోనే అందుతుందన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్‌ అలవెన్స్‌ అందిస్తోందన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోందని గవర్నర్‌ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ. 1,00,016 ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్‌ తెలిపారు.

గ‌వ‌ర్న‌ర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం సభ శ‌నివారానికి వాయిదా పడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శ‌నివారంనాడు సభలో చర్చ జరగనుంది.