English | Telugu
తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించం: కేసీఆర్
Updated : May 12, 2020
ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా, శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టని, ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గతంలో నెలకొన్న విభేదాలను, వివాదాలను పక్కనబెట్టి నదీ జలాలను వాడుకుందామని తాను స్నేహహస్తం అందించానని, బేషజాలు లేకుండా తాను చొరవ చూపితే, తమను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగించిందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. నదిలో నీటి వాటాలను తేల్చడంలో ట్రైబ్యునల్ లో జాప్యం జరుగుతోందని గుర్తు చేసిన ఆయన, సత్వర న్యాయం కోసం అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాలని అన్నారు.