English | Telugu
కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
Updated : Mar 14, 2020
కోవిడ్ - 19(కరోనా వైరస్)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించవద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరస్‌పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు కరోనా వైరస్‌పై సమీక్షలు జరుపుతున్నామని.. దేశంలో 65 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందికి కరోనా ఉందని.. కరోనా వైరస్ వచ్చాక 10 మంది కోలుకున్నారన్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మృతి చెందారని.. చరిత్రలో కరోనాలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నారు. ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తాయన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. మరో ఇద్దరి శాంపిళ్లను పుణె పంపించారని చెప్పారు. బయటిదేశం నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వస్తోందన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని.. ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ విమానాలు లేవన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు ఎవరొచ్చినా.. వాళ్లను 14 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారన్నారు. ఎయిర్‌పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వ్యాధి ప్రబలితే ప్రజలకు మాస్క్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. సాయంత్రం 6గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని... కేబినెట్ భేటీకి వైద్యాధికారులను పిలిచామని సీఎం తెలిపారు. అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు.