English | Telugu
అందుకే ఐపీఎల్ వాయిదా!
Updated : Mar 14, 2020
కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఐపీఎల్ 13వ సీజన్‌ను వాయిదా వేశారట. ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యమని, అందుకే ఏప్రిల్ 15 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను నిర్వహించాలని నిర్ణయించినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.
ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదా వరకే ఆలోచిద్దాం. భద్రతే అందరికీ తొలి ప్రాధాన్యం. అందుకే ఐపీఎల్ మ్యాచులను వాయిదా వేశాం. ఆ తర్వాత ఏం జరగనుందో చూద్దాం. పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలసు. ఇప్పుడే కరొనపై సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుంది' అని సౌరవ్ గంగూలీ అన్నారు.
ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ మొదలైతే డబుల్ హెడర్స్ (రోజుకు రెండు మ్యాచులు) ఎక్కువ అవుతాయని ప్రశ్నించగా.. ఇప్పుడే దాని గురించి ఏమీ చెప్పలేం అని దాదా సమాధానం ఇచ్చారు. ఐపీఎల్ వాయిదా వేసినందుకు ఫ్రాంచైజీలు సంతోషంగా ఉన్నాయా అని అడగ్గా.. 'ఎవరి చేతుల్లో ఏం లేదుగా' అని గంగూలీ చెప్పారు. ఏ విషయమైనా ఏప్రిల్ 15 తర్వాతే చెపుతాం అని దాదా స్పష్టం చేసారు.
ప్రస్తుతం జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌నూ సైతం బీసీసీఐ రద్దు చేసింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ.. కరోనా పంజా విసురుతుండంతో చివరికి రద్దు వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.
కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేయడంతో ఐపీఎల్, వన్డే సిరీస్ వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా అభిమానులు మరికొన్ని రోజులు భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కోల్పోయారు.