English | Telugu
దాన వీర శూర కరోనా
Updated : Mar 14, 2020
కిక్కిరిసిన క్రియేటివిటీ తో సోషల్ మీడియా లో కరోనా కు...దాన వీర శూర కర్ణ సినిమాలో నటరత్న ఎం టీ ఆర్ డైలాగ్ కు సామ్యం చూపుతూ ఔత్సాహిక నెటిజెనుడు రాసిన ఒక స్క్రిప్ట్ సోషల్ మీడియా లో ప్రస్తుతం హల చల్ చేస్తోంది.
అదేదో మీరూ చదవండి...
"ఆగాగు..
కరోనాచార్యదేవా!
అహ్హహ్హా.. ఏమంటివి? ఏమంటివి ?
వైరస్ నెపమున మనిషి మనుగడకింత నిలువనీడ లేదందువా?
ఎంత మాట? ఎంత మాట?
ఇది ఉత్త పరీక్షయేగానీ ఉపయోగపడే పరీక్ష కాదే ?
కాదు.. కాకూడదు.
ఇది మరణ పరీక్ష అందువా?
ఎబోలా వైరస్ జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నిఫా వైరస్ సంభవమెట్టిది?
మట్టిలో కలిసెను కదా?
అహ్హహ్హా.. అదికాదా నీ నీతి?
ఇంతయేల.. ప్రపంచమంతా వ్యాపించి.. వణికించి.. కబళించి.. కకావికలం చేస్తున్న మహమ్మారిలను మేం తరిమేయలేదా? వాటిదే పరీక్ష?
మానవాళి భవిష్యత్‌ను అంధకారం చేసి.. సకల ఖండాలను చుట్టబెట్టి.. కోట్లాది ప్రాణాలను హరించి మేం పునర్ జనించలేదా? వాటిదే పరీక్ష?
నాతో చెప్పింతువేమయ్యా..
మా వంశమునకు మూలపురుషులైన ఆదిమానవులు మహమ్మారిని తట్టుకోలేదా?
అంతకంతకూ వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటువ్యాధిని.. ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన కలరాను..
దానిని దాటేసుకుంటూ వచ్చిన మశూచిని..
ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును..
ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవీని..
దానికంటే డేంజరైన క్యాన్సర్‌ను..
ఆ పిదప వచ్చిన సార్స్‌ను..
అంతటితో ఆగకుండా దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను..
ఆవుల నుంచి వచ్చిన క్షయను..
బాతుల నుంచి వచ్చిన ఫ్లూను..
మా ఇండ్లలో అప్పుడప్పుడూ వచ్చి పిలగాండ్లను పలకరించే ఆటలమ్మను..
అంతకంతకూ తట్టకుని బతికి బట్టకట్టలేదా?
సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన ఈ వైరస్ వంశము ఏ నాడో మా చేతుల కుక్క చావు చచ్చినది.
కాగా నేడు కరోనా.. కరోనా అను వ్యర్థ వాదములెందుకు.. ??"
అంటూ ఆ నెటిజెనుడు రాసిన స్క్రిప్ట్ చదువరులను అలరిస్తోంది.