English | Telugu

ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో పీపీఈ కిట్లకు ఏమాత్రం కొరత లేదని, 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు... డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, లక్ష మంది పేషెంట్లకైనా చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని కేసీఆర్ చెప్పారు. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.