English | Telugu

దిశా చట్టానికే దిక్కు లేదు! ఈ నేరాలు, ఘోరాలు ఆపేదెవరు?

దిశ పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయా? దిశా చట్టం అటకెక్కిందా? నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలవి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అద్భుతుంగా ఉన్నాయని, గతంలో కంటే క్రైమ్ రేట్ 18 శాతం తగ్గిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పకుంటుండగా... క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రోజూ ఎదో ఒక చోటు దారుణం జరుగుతూనే ఉంది. మహిళలు, పిల్లలపై అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి . దారుణ హత్యలు జరుగుతున్నాయి.

విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్యచేసిన దుర్మార్గాన్ని మరిచిపోకముందే విశాఖపట్నంలో మరో కిరాతకం జరిగింది. గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని అఖిల్ వెంకటసాయి అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. విశాఖ నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు. కొన్నిరోజుల కిందట విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందు కుడా రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళితులపై దాడులు, శిరోముండనాల కేసులు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన వారిపై పోలీసులే శిరోముండనం వేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణే లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ అసమర్దత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమాలు, ఆందోళనలను అణచివేయడంలో ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు ఇతర అసాంఘిక శక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందని నిలదీస్తున్నారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని, యువతులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.