English | Telugu
తాగినంత మందు.. పర్సునిండా నోట్లు! దుబ్బాక ఓటర్లకు పండుగ
Updated : Nov 2, 2020
ప్రలోభాల పర్వంలో అధికార పార్టీ అంతా సైలెంట్ గా పని కానిచ్చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల ముందే గ్రామాలకు డబ్బులు, మందును చేరవేసిన టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం వాటిని ఓటర్లకు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం యాబై మంది ఓటర్లకో ఇంచార్జ్ ని అధికార పార్టీ నియమించిందని తెలుస్తోంది. కుల సంఘాలు, మహిళా సంఘాలు, రైతులు, యువత .. ఇలా గ్రూపులుగా విడగొట్టి గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీసీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. దీంతో డబ్బు పంపిణి వారికి ఈజీగా మారిందని చెబుతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీకి ధీటుగా కనిపించిన బీజేపీ,,, తాయిలాల విషయంలో మాత్రం వెనకబడిందని చెబుతున్నారు. డబ్బుల పంపిణికి ప్రయత్నాలు చేసినా... ఆ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలో కోటి రూపాయల నగదు పట్టుబడగా.. అది బీజేపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బుగా తేలింది. కారులో కోటి రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నామని, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిదిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ప్రకటించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కోటి రూపాయలు పట్టుబడటంతో బీజేపీ నేతలు షాకయ్యారని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే సిద్ధిపేటలోని రఘునంందన్ రావు మామ ఇంట్లో జరిగిన సోదాల్లో 18 లక్షలు పట్టుబడ్డాయి. అంతకుముందు దుబ్బాక శివారులో పట్టుబడిన డబ్బుులు కూడా బీజేపీ నేతలవేననే అనుమానాలు ఉన్నాయి. ఇలా వరుసగా షాకులు తగలడంతో బీజేపీ అభ్యర్థికి పంపకాలు కష్టంగా మారాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.
దుబ్బాకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా పంపకాలను భారీగానే చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అన్ని గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారాన్ని హోరెత్తించిన నేతలంతా వెళ్లిపోవడం, లోకల్ లీడర్లు అంతంతమాత్రంగానే ఉండటంతో .. ప్రజల్లో తమవైపు సానుకూలత ఉన్నా.. ఓటుగా మలుచుకోలేకపోతున్నామనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో దాదాపు 2 కోట్ల వరకు నగదు దొరకగా... అందులో ఎక్కువ భాగం విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల దగ్గరే దొరికిందని తెలుస్తోంది. దీనిపైనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. అదికార పార్టీ నేతలు దర్జాగా డబ్బులను తరలిస్తున్నా, ఓటర్లకు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతలపై మాత్రం నిఘా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు , స్థానికుల అధికారుల సహకారంతో గులాబీ నేతలు గుట్టుగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.