English | Telugu

నోటి దురుసు మంత్రి పదవి పోయినట్టేనా? కొడాలి నానిపై నిమ్మగడ్డ క్రిమినల్‍ కేసు?

కొడాలి నాని మంత్రి పదవికి ఎసరొస్తొందా? నోటి దురుసే ఆయన కొంప ముంచబోతుందా? కొడాలి కటకటాల లోపలికి వెళ్లక తప్పదా? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే హాట్ చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న మంత్రి కొడాలి నాని త్వరలో తీవ్ర ఇబ్బందుల్లో పడనున్నారని తెలుస్తోంది. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై అడ్డగోలు విమర్శలు చేస్తున్న కొడాలి నాని అడ్డంగా బుక్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన మంత్రి పదవిని కోల్పోవాల్సి రావచ్చని కూడా చెబుతున్నారు.

రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న తనను వ్యక్తిగతంగా దూషిస్తున్న మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్దమవుతున్నారని తెలుస్తోంది. తనను వ్యక్తిగత దూషించడమే కాకుండా కనీస మర్యాద పాటించకుండా నిత్యం విమర్శలు, ఆరోపణలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కొడాలి నానిపై నిమ్మగడ్డ క్రిమినల్‍ కేసు పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం గవర్నర్‍ను కలిసినప్పుడు కూడా మంత్రి కొడాలి నాని తిట్ల వ్యవహరాన్ని నిమ్మగడ్జ రమేశ్ కుమార్ ఆయన దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది. తనపై నాని చేసిన విమర్శలు, వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికలో వచ్చిన వార్తలను, పలు టివి ఛానెళ్లలో ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులను కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ అందించారని సమాచారం. మంత్రి హోదాలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉన్న తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న కొడాలి నాని కఠిన చర్య తీసుకోవాలని పరోక్షంగా మంత్రిని పదవి నుండి తొలగించాలని గవర్నర్ ను నిమ్మగడ్డ కోరినట్లు తెలిసింది.

తిట్ల బాగోతంపై నిమ్మగడ్డ గవర్నర్‍కు ఫిర్యాదు చేసినా తర్వాత కూడా తన తీరు మార్చుకోలేదు కొడాలి నాని. గురువారం నాడు కూడా నిమ్మగడ్డపై విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆదేశాలను మాత్రమే నిమ్మగడ్డ పాటిస్తున్నారన్నారని నాని ఆరోపించారు. దీంతో మంత్రి కొడాలి నాని పై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. కొడాలి నానిపై క్రిమినల్‍ కేసుపెట్టేందుకు నిమ్మగడ్డ సీనియర్‍ న్యాయవాదులను సంప్రదించినట్లు తెలిసింది. దీనిపై నిమ్మగడ్డ బహిరంగంగా వివరాలు చెప్పకపోయినా.. రేపో మాపో మంత్రి కొడాలినానిపై ఆయన క్రిమినల్‍ కేసు పెట్టడం ఖాయమని తెలుస్తోంది.

మంత్రి కొడాలి నాని దూషణ పర్వాలకు పులిస్టాప్‍ పెట్టకుంటే ఆయన మరింత రెచ్చిపోతారని రిటైర్డు అధికారులు అంటున్నారు. రాజ్యాంగపరమైన స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్‍ హోదాలో ఉన్న సీనియర్‍ రిటైర్డు ఐఎఎస్‍ అధికారిని మంత్రి కొడాలి నాని దూషించటం సరికాదంటున్నారు. కొడాలి నానిని మంత్రి వర్గం నుండి గవర్నర్‍ తొలగించాలని ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‍ కృష్ణారావు కొందరు అధికారులతో తెర వెనుక చెప్పినట్లు తెలిసింది.

మంత్రి హోదాలో ఉండి ఎన్నికల కమిషనర్ ను కొడాలి నాని తిడుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదు. నానిని కేబినెట్ నుంచి తప్పించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మేథావులు సూచిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో సీఎం జగన్ ప్రోదల్బంతోనే కొడాలి మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే కొడాలి నానిని జగన్ ఎంతగా వెనకేసుకొచ్చినా.. క్రిమినల్ కేసు నమోదైతే మాత్రం అతనిని పదవి నుంచి తొలగించాల్సిందేనని తెలుస్తోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనరే క్రిమినల్ కేసు పెడితే.. నానిని ఇక ఎవరూ కాపాడలేరనే అభిప్రాయం న్యాయ నిఫుణులు, రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తానికి తన నోటి దురుసుతోనే కొడాలి నాని చిక్కుల్లో పడబోతున్నారని, మంత్రి పదవికి సైతం ఎసరు తెచ్చుకుంటున్నారనే ప్రచారమే ఇప్పుడు ఏపీలో హాట్ హాట్ గా మారింది.