English | Telugu

వైసీపీ-బీజేపీ మధ్యే పోటీ... వచ్చే ఎన్నికల తర్వాత మూడో స్థానానికి టీడీపీ

ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యంగా ఆనం కామెంట్స్ పై స్పందించాలని పలువురు తెలుగుదేశం నేతలు... వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కోరారు. అయితే, ఆనం వ్యాఖ్యలపై తన భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దాంతో పార్టీ వేదికపైనే తన వెర్షన్ వినిపిస్తానని చెప్పుకొచ్చారు. అయినాసరే పట్టువదలని కొందరు టీడీపీ సభ్యులు.... ఆనం కామెంట్స్ వెనుకున్న మర్మమేమిటో చెప్పాలని కోటంరెడ్డిని విసిగించారు. మంత్రి అనిల్, కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఆరోపణలు చేశారన్న టాక్ రావడంతోనే రియాక్షన్ కోసం పట్టుబట్టినట్లు తెలుస్తోంది.

అయితే, ఆనం ఇష్యూను పక్కకు తప్పించిన కోటంరెడ్డి.... తెలివిగా తన మాటలను చంద్రబాబు వైపు మళ్లించారు. జగన్మోహన్ రెడ్డి వల్లే చంద్రబాబుకి ఇంకా ప్రతిపక్ష హోదా కొనసాగుతోందని, లేదంటే ఇప్పటికిప్పుడు 13మంది వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. శాసనసభ్యత్వానికి ఇబ్బంది లేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలో చేరాలన్న నిబంధనను జగన్ పక్కనబెడితే తెలుగుదేశం మొత్తం ఖాళీ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పిన కోటంరెడ్డి... 2025లో పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఆనం కామెంట్స్ పై స్పందించాలని కోరితే, తిరిగి తిరిగి చంద్రబాబును టార్గెట్ చేయడంతో కోటంరెడ్డిపై మండిపడ్డ టీడీపీ సభ్యులు... పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలే బీజేపీ, తెలుగుదేశంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ కౌంటరిచ్చారు. అయినా, టీడీపీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించడం మానేసి ముందు మీ ఎంపీలు, ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలని, పైగా మాఫియాలా తయారయ్యారని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలే అంటున్నారని ఎద్దేవా చేశారు.