English | Telugu

ఆనం అలక తీర్చి సర్దుబాటు చేసిన పార్టీ హై కమాండ్.. టీ కప్ లో తుఫానే!!

తాజాగా ఆనం చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపాయి. అందుకు తగ్గట్టే అధిష్ఠానం కూడా రామనారాయణరెడ్డి పై మండిపడింది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తూ.. షోకాజ్ నోటీసు జారీ చేయాల్సిందిగా విజయసాయిరెడ్డిని ఆదేశించారు జగన్. నెల్లూరులో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆనం చేసిన కామెంట్లు మంటలు రేపాయి. ఆనం అసంతృప్తి వెనుక చాలానే కారణాలు ఉన్నాయంటున్నారు. పార్టీ గెలిచిన తరువాత చాలా కాలం సైలెంట్ గానే ఉన్న ఆనం ఉన్నట్టుండి పార్టీ నేతల మీద విరుచుకుపడటానికి వివేకా మరణం తరువాత తమ కుటుంబం ప్రాధాన్యత తగ్గడం ఒక కారణమంటున్నారు.

ఇన్నాళ్లూ ఆ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న వెంకటగిరి రాజా కాలేజ్ ఇప్పుడు అధికారుల పర్యవేక్షణ లోకి వెళ్ళింది. మరోవైపున వెంకటగిరి నియోజకవర్గంలో ఆల్తూరుపాడు ప్రాజెక్టు పనులు రద్దయ్యాయి. 260 కోట్ల రూపాయల విలువ చేసే ఈ పనులు రద్దు వెనక మంత్రి అనిల్ ఉన్నారనేది ఆనం వర్గీయుల వాదన. ఇంకోవైపున వెంకటగిరి వేణుగోపాల స్వామి ఆలయానికి ఆనం కుటుంబం నుంచి ఎవరో ఒకరు ట్రస్టీగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఈ ఆలయానికి పాలక మండలిని నియమించాలనే ఆలోచనలో ఉంది సర్కార్. సీనియర్ అయినప్పటికీ మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి రాంనారాయణరెడ్డిలో ఉంది. ఇక ఆనం వివేకా చనిపోయిన తరువాత ఆ కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత తగ్గింది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో హవా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కారణాల వల్ల ఆయన అసంతృప్తితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆనం వ్యాఖ్యలను అధిష్ఠానం సీరియస్ గా తీసుకుని షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే తరువాత ఆ ఊసే వినపడలేదు. అయితే అనంతరం చల్లబడిన అధిష్టానం ఆనం అసంతృప్తి పై దృష్టి పెట్టి ఏదో ఒక హామీ ఇచ్చే ఉంటుందని ఒక టాక్. దీనికి తగినట్లే ఇవాళ అసెంబ్లీలో టీడీపీ పై ఎదురు దాడికి దిగారు ఆనం. మొత్తం మీద ఆనం వివాదం టీ కప్పులో తుపానులా ముగిసి పోతుందేమో చూడాలి.