English | Telugu

కాంగ్రెస్ వైపు చూస్తోన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు..!

జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా... కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన స్వేచ్ఛను అనుభవించిన నేతలు... తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో చేరితే... అక్కడ పరిస్థితులకు అడ్జస్ట్ కాలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటికి చెప్పలేరు... ఇండిపెండెంట్ గా వ్యవహరించలేరు... ఏదైనా పార్టీ అధినేత కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. అంత తేడా ఉంటుంది కాంగ్రెస్ కు... ఇతర పార్టీలకు. అయితే, కాంగ్రెస్ ను వదిలి ఇతర పార్టీల్లో చేరిన నేతలు తప్పనిసరి పరిస్థితుల్లోనే అక్కడ కొనసాగుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో గమనించినా... ఆయా నేతల పరిస్థితిని అంచనా వేయొచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షులుగా పనిచేసినా, కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినా, కాంగ్రెస్ లో అత్యున్నత కీలక పదవులు చేపట్టినా... ఇతర పార్టీల్లో చేరాక మాత్రం వాళ్లంతా సైలెంట్ గా మిగిలిపోతున్నారు. అసలు వాళ్లున్నారో లేదో కూడా తెలియనంతగా మౌనవ్రతం దాల్చుతున్నారు. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా... పలువురు నేతల పరిస్థితి ఇదే.

అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అండ్ బీజేపీల్లో చేరిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాము చేరిన పార్టీల్లో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం... కనీసం స్వేచ్ఛ లేకపోవడంతో... తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ముఖ్యంగా ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ నేతలకు... కనీస ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇబ్బందిపడుతున్నారట. ఎన్నికలకు ముందు సురేష్ రెడ్డికి కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినా... నిజామాబాద్ లో కవిత ఓటమిపాలవడంతో ఆ హామీని పక్కనబెట్టినట్లు చెబుతున్నారు. ఇక, ఐదేళ్ల క్రితం టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సారయ్య పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. కనీసం పట్టించుకున్న పాపాన లేదని అంటున్నారు.

ఇక, బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. దాంతో, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తనకు నామినేటెడ్ పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని డీకే అరుణ వాపోతున్నట్లు తెలిసింది. పైగా తమ అభిప్రాయాలకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీతో పోల్చితేన కాంగ్రెస్ లోనే వాతావరణం బాగుంటుందని, స్వేచ్ఛగా మసలుకోవచ్చని, అలాగే అభిప్రాయాలకు విలువ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీల్లో స్వేచ్ఛగా మసలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటోన్న మాజీ కాంగ్రెస్ లీడర్లు... మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.