English | Telugu
ఆయన అన్నం పెడితే....వీరు మాత్రం ఆయనకు వాతలు పెట్టారు !
Updated : Mar 12, 2020
* పత్తా లేని సుధాకర్ యాదవ్, నారాయణ
* కార్పొరేట్ల ను నమ్ముకున్నందుకు, వారు బాబు కు బానే బుద్ధిచెప్పారు
అన్నం పెడితే అరిగిపోతుంది.. చీర పెడితే చిరిగిపోతుంది.. వాత పెడితే నిలిచిపోతుంది అని సామెత! ఈ సామెత ను త్రికరణ శుద్ధిగా ఫాలో అయిన కడప జిల్లా టీ డీ పీ నేతలు, తమకు అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడుకు కావాల్సినన్ని వాతలు పెట్టి మరీ బీ జె పి లోకి, వై ఎస్ ఆర్ సి పి లోకి జంప్ అయ్యారు. జమ్మలమడుగులో పార్టీని కాపాడుతూ వచ్చిన రామసుబ్బారెడ్డి ప్రత్యర్ధి, ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని, మంత్రి పదవి ఇచ్చారు. అది, ఆయన వర్గం చేతిలో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు, బాబు తప్పుడు సంకేతాలిచ్చిందన్న విమర్శకు కారణమయింది. చివరకు ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత, బీజేపీలో చేరారు. పోనీ, అలాగని రామసుబ్బారెడ్డినీ బాబు కాపాడుకోలేకపోయారు. ఫలితంగా, ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు. సీఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, రెండుసార్లు రాజ్యసభ సీటిచ్చారు. భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆయన చాలాకాలం క్రితమే బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత డీ.ఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడి, బాబుతో చర్చలు కూడా జరిపారు. కానీ, యనమల రామకృష్ణుడు ఒత్తిడితో, ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు సీటు ఇచ్చారు. అప్పటికే టీటీడీ చైర్మన్ పదవి, కాంట్రాక్టులు తీసుకున్న సుధాకర్‌కు మరో అవకాశం ఇవ్వడం, విమర్శలకు దారితీసింది. అయినా యనమల కోసం సుధాకర్‌కు సీటిచ్చారు. ఇప్పుడు అదే సుధాకర్ యాదవ్ కనిపించడం మానేశారు. కడప జిల్లాలో ఎప్పుడూ టీడీపీ బలం పెరగకపోయినా, వర్గాల కారణంతో.. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తల సంఖ్య మాత్రం బాగానే ఉంది.
నిజానికి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీ.ఎం చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల అనుభవం, నలభై ఏడేళ్ల జగన్ ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. చెన్నారెడ్డి, కోట్ల, నేదురుమల్లి, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలను ఎదుర్కొని నిలబడ్డ బాబు ధైర్యం, జగన్ వంటి యువనేత ముంగిట నిలవలేకపోతోంది. చివరకు సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది. నాయకులపై ఆయన లెక్కలు దారుణంగా తప్పుతున్నాయి. ఆయన వేసుకున్న తాత్కాలిక అవసరాలు, రాజకీయ అవసరాలనే పునాదులు కుప్పకూలిపోతున్నాయి. నమ్మిన వారే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడిపోతున్నారు. అందలమెక్కించినవారే అలవోకగా కాడి కిందపడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, కాంట్రాక్టులు పొందిన వ్యాపారులు, విపక్షంలోకి రాగానే వైసీపీ గూటికి చేరుతున్నారు. మంత్రులుగా వెలగబెట్టిన ప్రముఖులు, వ్యాపారాలు చేసుకుని పార్టీ ముఖం చాటేస్తున్నారు. మరి ఏమయింది బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం? ఏమయిపోయింది ఆయన రాజకీయ చాణక్యం? ఎక్కడికి పోయింది ఆయన ఇమేజ్? నేతల విషయంలో ఆయన లెక్కలు ఎందుకు తప్పినట్లు?.. ఇదీ ఇప్పుడు తెలుగుతమ్ముళ్లలో జరుగుతున్న చర్చ.
కడప జిల్లాలో మొన్న సీ.ఎం.రమేష్, నిన్న సతీష్‌రెడ్డి, రేపు రామసుబ్బారెడ్డి. ఎల్లుండి ఇంకెవరో? వరస పెట్టి వలస వెళుతున్నారు. వీరిలో రామసుబ్బారెడ్డి మినహాయిస్తే, మిగిలిన వారు కాంట్రాక్టర్లు, సగం రాజకీయ నాయకులు. సీ.ఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, కడప జిల్లాపై పెత్తనంతోపాటు, రెండు సార్లు ఎం.పీ సీటిచ్చారు. ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల వైసీపీ ఎం.పీగా టికెట్ సాధించిన అంబానీ అంతేవాసి పరిమళ్ నత్వానీ వ్యవహారంలో రమేష్ సమన్వయం కూడా ఉందంటున్నారు. సతీష్‌రెడ్డికి వరసగా అసెంబ్లీ టికెట్‌తోపాటు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చి, కౌన్సిల్ పదవి కూడా ఇచ్చారు. ఆయన కూడా తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.
ఇదిలా ఉంటె, పార్టీకి అనాదిగా సేవలందించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైసీపీలో చేరిపోయారు . పార్టీ కోసం కుటుంబసభ్యులను, వందలసంఖ్యలో అనుచరులను పోగొట్టుకున్న రామసుబ్బారెడ్డి కూడా, టీడీపీని వీడటమే ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది. వైఎస్ హయాంలో కూడా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ రామసుబ్బారెడ్డిలో ఆత్మస్థైర్యం సడలి, జగన్ వైపు అడుగులు వేయడానికి తమ నాయకత్వం తీరే కారణమన్నది తమ్ముళ్ల విమర్శ. ఇక ఇప్పుడు కడపలో మిగిలింది కొద్దిమంది నేతలే. ప్రకాశంలో ప్రతిసారీ, బాలకృష్ణ సిఫార్సుతో టికెట్ తెచ్చుకునే బాబూరావు కూడా వైసీపీలో చేరారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, అనేక జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీ కండువా వేసుకుంటున్న వైనం, పార్టీవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, ఇతర పార్టీల వారిని తాత్కాలిక అవసరాలకు చేర్చుకున్న ఫలితమే.. ఈ పరిణామాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లిస్తే, ఐదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీ మాత్రం, వరసగా అగ్రకులాలకే సీట్లిచ్చిందని, వారంతా అధికారం పోయిన తర్వాత పార్టీని వీడారని గుర్తు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు కాకుండా, సీఎం రమేష్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిన ప్పటికీ, ఆయన బీజేపీలోకి వెళ్లారు. సీట్లు ఇచ్చిన నలుగురు ఎం.పీలూ బీజేపీలో చేరారని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తప్పిదాలేనని, వారి విషయంలో ఆయన లెక్కలు తప్పాయని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. మాగుంట, ఆదాల వంటి వ్యాపారులను చేర్చుకోవడం వల్ల పార్టీ ఏం సాధించిందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి, సీనియర్లను అవమానించారని.. ఇప్పుడు నారాయణ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా, బిజినెజ్ హౌస్ ల అధినేతలను కాకుండా, జనం లోనుంచి వచ్చిన నాయకులను చట్ట సభలకు పంపితే, పార్టీ పరువు నిలుస్తుందని చంద్రబాబు నాయుడు కు పార్టీ కార్యకర్తలు సూచన చేస్తున్నారు.