English | Telugu

జగన్, లక్ష్మీ పార్వతి..ఓ జీతంలేని పోస్టు...

జగన్ ని చూస్తుంటే అచ్చం అన్న ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టే ఉంటుంది నాకు.. అయన తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు జగనే.. వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి ఎన్నో పొగడ్తలతో జగన్ ని ముచ్చేత్తుతుంటారు లక్ష్మీ పార్వతి. ‘మళ్లీ ఒకవేళ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపించాలని ఉందని తనతో అనేవారని’, అన్నగారు అన్నారో, లేదో తెలియని ఇలాంటి మాటలను కూడా సమయం దొరికినప్పుడల్లా వల్లే వేస్తుంటారు మేడం గారు.

ఇంకా చాలా మాటలు చెప్తుంటారు ఆమె. ఇలాంటి కధకురాలు ఒకరు ఉండాలనే భావనతో జగన్ సర్కార్ అన్న నందమూరి తారకరామారావు రెండో భార్య లక్ష్మీపార్వతికి ఓ నామినేటెడ్ పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ గా ఆమెని నియమించారు.క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు.

ఆమెని ఆ పదవిలో నియమించి నాలుగు నెలలు గడిచినా ఒక్క పైసా జీతం కానీ.. అసలు ఆ పదవి బాధ్యతలు కానీ.. అందుకు సంబంధించి ఒక కార్యాలయం కానీ ఎక్కడా ఏర్పాటైన దాఖలాలు లేవు. లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బద్ద శతృవు.. ఆ శతృత్వమే ఆమెని వైసీపీకి దగ్గర చేసింది. ఎన్టీఆర్ అభిమానులలో సానుభూతి కోసం.. అవసరమైతే చంద్రబాబుకి కౌంటర్ కోసం మాత్రమె వైసీపీ ఆమెని ఉపయోగించుకుంది. లక్ష్మీపార్వతి కూడా చాలాకాలంగా వైసీపీ కోసం చాలా కష్టపడుతున్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆమె చంద్రబాబుకి వ్యతిరేకంగా తన వాక్పటిమను చాటుకుని జగన్ దగ్గర మార్కుల కోసం పాకులాడుతూనే ఉంటారు. పొగడ్తలకు అస్సలు లొంగని సీఎం జగన్ ఆమెకి తెలుగు అకాడమీ చైర్మన్ పదవిని ఇచ్చారు..నిజం.

అయితే, జగన్ అండ్ కో ఆ పదవి పరిస్థితి ఏంటి? అధికారాలేంటి? ఇప్పుడు ఆ పదవిని ఆమెకి అప్పగించవచ్చా? అన్న ఆలోచన లేకుండా చేశారా? లేక కావాలనే అసలు రాష్టంలోని లేని పదవిలో ఆమెని కూర్చోబెట్టి ఏదో ఆమెని కూడా గౌరవించామని రంగేశారా.. అనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం ఆ పదవి రాష్ట్రంలో లేదు.

అయితే, ఇది జగన్ సర్కార్ తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ ప్రస్తుతానికి అయితే లక్ష్మీపార్వతికి ఇచ్చింది ఉత్తుత్తి పదవేనని అర్ధమవుతుంది. అసలు ఒక ప్రభుత్వం తెలియక ఇంత అమాయకంగా ఒక చైర్మన్ పదవిని ఇస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవి లేదన్న విషయం కూడా తనకు జీతం, భత్యం అందకపోవడంతో లక్ష్మీపార్వతే స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేసుకుని తెలుసుకున్నారట.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు అకాడమీ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంది. విభజన చట్టంలో షెడ్యూల్ 10 కిందకు వచ్చే అంశాలలో తెలుగు అకాడమీ కూడా ఉంది. అంటే ఇంకా ఆ సంస్థను విభజించలేదు. కనుక ఇప్పటికీ ఆ సంస్థకి ఒక్కరే చైర్మన్ ఉంటారు. అది తెలంగాణ ప్రభుత్వం నియమించుకుంది. షెడ్యూల్ 10 అంశాల విభజన తర్వాతనే ఏపీకి ప్రత్యేక సంస్థ వస్తుంది.

పదవి అప్పగించి నెలలు గడుస్తున్నా తన ఆఫీసు ఎక్కడో తెలియక, ఎలాంటి అధికారాలు లేక.. జీతభత్యాలు కూడా అందక ఆమె ప్రభుత్వ పెద్దల వద్ద ఆరా తీశారట. ఇది ఉన్నతవిద్యాశాఖ కిందకి వస్తుందని వాళ్లే జీతాలు చెల్లిస్తారని చెప్పడంతో ఆమె ఉన్నతవిద్యాశాఖ వద్దకు వెళ్లారు. అక్కడకి వెళ్తే ఆ సంస్థ ఇంకా ఉమ్మడిగానే ఉందని, రాష్ట్రంలోనే లేని పోస్టుకు జీతాలు ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఆమె పెద్దలపై రుసరుసలు మొదలుపెట్టారట. దీంతో ఖంగుతిన్న పెద్దలు మేడంగారు మళ్ళీ ఎక్కడ నోటికి పని చెప్తారో అని భయపడి ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖతో ఆ జీతభత్యాలను తామే చెల్లిస్తామని హామీ ఇప్పించారట. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలుగు బాష వ్యాప్తి, వృద్ధి ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. అయితే, సీఎం జగన్ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో అసలు అకాడమీతో పనేంటో..కూడాతెలియకుండా అంటే అసలు రాష్ట్రంలోనే లేని అకాడమీకి.. ఉన్నా ఏ మాత్రం ఉపయోగం లేని అకాడమీ చైర్మన్ గా లక్ష్మీపార్వతి నెలకు 4 లక్షల జీతం తీసుకోబోతున్నారన్నమాట.