English | Telugu

ఫోన్లో విన్నది నాదగ్గు కాదు..నాకు కరోనా రాలేదు..

ఎక్కడ చూసినా కరోనా..కరోనా..ఆర్ధిక వ్యవస్తకూడా దీని బారిన పడిందని వార్తలు. స్టాక్ మార్కెట్ కూడా దీని బారిన పడి లక్షలకోట్లు నష్టాలు చవిచూసింది. ఇప్పుడు ఆ మహమ్మారి ఫోన్ల వినియోగదారులపై పడింది. కరోనా వైరస్ సోకుతుందో లేదో తెలియదు కానీ కానీ ఫోన్ ముట్టుకోవాలంటేనే భయపడి చచ్చే కాలం వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్ చేస్తే అన్ని సార్లు కరోనా నివారణ మెసేజ్ రావడం వినియోగదారులకు విసుగు, విరక్తి కలిగిస్తోంది. ఎవరికి ఫోన్‌ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఇంగ్లీష్ లో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం..ఇదీ ప్రస్తుత పరిస్తితి.

ఆ తర్వాతే కాలర్ రింగ్ టోన్ వస్తోంది. దీంతో ఫోన్ ముట్టుకోవాలంటే కరోనా వైరస్ మనకే వచ్చినంత భయం పుడుతోంది. అర్జెంట్ ఫోన్ కాల్స్ చేయాలంటే 30 సెకన్ల కరోనా మెజేసి ఆ తర్వాత మరో 30 సెకన్ల పాటు రింగ్ కావడంతో ఫోన్ చేసిన తర్వాత ఒక నిమిషం సేపు వేచి ఉండాల్సి వస్తున్నది. మనం కాల్ చేయగానే డయల్ పాడ్ ఓపెన్ చేసి ఒకటి నొక్కితే కరోనా ట్యూన్ ఆగిపోవాలి. కానీ చాలాసార్లు అలా జరగడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాలర్‌ ట్యూన్‌ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఇంగ్లీష్ లో ప్రజలను గజిబిజి చేసే విధంగా సమాచారం ఇవ్వడం కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి.

అంతే కాకుండా కాలర్‌ ట్యూన్‌లో చెప్పే టోల్ ఫ్రీ నంబర్ 01123978046 పనిచేయడం లేదన్న విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ కాలర్‌ట్యూన్‌ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ట్యూన్‌తో పాటు కాల్‌ కనెక్ట్‌ కావడం లేదని, ఈ ట్యూన్‌ పూర్తయ్యాకే మనం ఫోన్‌ చేసిన వ్యక్తికి లైన్‌ కలుస్తుండటంతో చాలా టైమ్‌ వేస్ట్‌ అవుతోందని, పదేపదే అదే ట్యూన్‌ వినడం విసుగుపుట్టిస్తోందని ఎక్కువ మంది మొబైల్‌ వినియోగదారులు అంటున్నారు.