English | Telugu
జగన్ వైపు రామసుబ్బారెడ్డి చూపు..! జమ్మలమడుగులో హీటెక్కిన రాజకీయం
Updated : Mar 9, 2020
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో టీడీపీకి ముఖ్యనేతగా ఉంటూ, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగుతోన్న సీనియర్ లీడర్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి... త్వరలో తెలుగుదేశానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామసుబ్బారెడ్డి త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లు జమ్మలమడుగులో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. సీఎం జగన్ తో మాట్లాడిన కడప జిల్లా వైసీపీ ముఖ్యనేతలు... రామసుబ్బారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రప్పించడానికి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి నుంచి క్లియరెన్స్ రావడంతో, అనుచరులు, కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. రామసుబ్బారెడ్డి రాకను మొదట జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కావడంతో కాదనలేక సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. అయితే, రామసుబ్బారెడ్డి... వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారన్న సమాచారంతో... కడప జిల్లా టీడీపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డిని కలిసిన తెలుగుదేశం నేతలు... పార్టీ మారకుండా బుజ్జగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి, 2019 ఎన్నికలకు ముందే, రామసుబ్బారెడ్డి... వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన రామసుబ్బారెడ్డి... అప్పుడే పార్టీ మారతారని అనుకున్నారు. అయితే, రామసుబ్బారెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు... ఆదినారాయణరెడ్డితో సయోధ్య కూడా కుదిర్చారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి.... ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. అయితే, ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆదినారాయణరెడ్డి తెలుగుదేశాన్ని వీడి... బీజేపీ గూటికి చేరారు. అయితే, ఇప్పుడు, రామసుబ్బారెడ్డి... వైసీపీ వైపు చూస్తున్నార్న ప్రచారంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.