English | Telugu
జగన్ ప్రభుత్వానికి అమరావతి భయం... అందుకే అక్కడ ఎన్నికలు వాయిదా?
Updated : Mar 9, 2020
గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలతోపాటు, రాజధాని గ్రామాల్లో ఎన్నికలను నిలిపివేయడంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజధాని గ్రామాల ప్రజలు... అమరావతిని తరలించొద్దంటూ దాదాపు మూడు నెలలుగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, రైతు కూలీలు... ఇలా ప్రజలందరూ ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. దాంతో, రాజధాని గ్రామాలతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ భయంతోనే నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీని... రాజధాని తరలింపు భయం వెంటాడుతోందని టీడీపీ విమర్శిస్తోంది. అందుకే, అమరావతి రైతుల ఉద్యమ ప్రభావమున్న గుంటూరు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు. ఇక, అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లోనూ ఎన్నికలను నిలిపివేశారని, దీనంతటికి ఓటమి భయమే కారణమని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. వాయిదా వేసిన మున్సిపాలిటీల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, వైసీపీ ఘోర పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు.
మూడు రాజధానుల నిర్ణయంతో గుంటూరు జిల్లాలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటున్నారు. ముఖ్యంగా తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన వాళ్లు కూడా ఇఫ్పుడు పూర్తిగా రివర్స్ అయ్యారని అంటున్నారు. వైసీపీకి మంచి పట్టున్న తాడేపల్లి మున్సిపాలిటీలో సైతం ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావిస్తున్నారు. ఇవన్నీ గమనించే, వ్యూహాత్మకంగా నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే, కోర్టు కేసులు, పంచాయతీల విలీనాల కారణంగానే ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయని వైసీపీ చెబుతోంది.