English | Telugu
కరోనా వైరస్ వచ్చినట్లు గుర్తించడం ఎలా?
Updated : Mar 15, 2020
ప్రపంచాన్ని భయంకర కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు కాకపోవడంతో ప్రజల్లో భయం రెట్టింపు అయింది. దీంతో ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. ప్రపంచాన్ని భయ కంపితులను చేస్తున్న కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి ఎటువంటి మార్పులు కనిపిస్తాయి? ఎలాంటి ప్రభావం కనిపిస్తుందన్న అంశాలపై లాన్సెట్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులోని వివరాల ప్రకారం, ఈ వైరస్ సోకిన తరువాత తొలి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటకు కనిపించవు. కొందరిలో 14 రోజుల పాటు ఏ మార్పులూ నమోదు కావు. ఒకసారి ప్రభావం కనిపించడం ప్రారంభమైన తరువాత... తొలి మూడు రోజులు ఒళ్లు వెచ్చబడుతుంది. ఆపై గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే కనిపించాయి. ఇక, నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజు లోగా, వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. ఊపిరి అందడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. బాధితుల్లో ఈ దశను ఎదుర్కొన్న వారు 14 శాతం మంది. ఆపై పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది.
ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటె న్సివ్ కేర్ చికిత్స తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారికి ఈ పరిస్థితికి వచ్చిన వారు 5 శాతం వరకూ ఉన్నారు. ఇక వీరిలో రోగ నిరోధక శక్తి బాగుండి, ఇతర జబ్బులు లేకుంటే, కరోనాను సులువుగా జయించవచ్చు. బీపీ, షుగర్, గుండె జబ్బులు తదితరాలు ఉన్నా, 60 ఏళ్లు దాటినా కరోనా వారికి పెనుముప్పుగానే పరిణమిస్తుంది.
మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా.
మన శరీరంలో కూడా ఎన్నో వైరస్‌లు ఉన్నప్పటికీ చాలా వైరస్‌లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్‌లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్‌ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్‌లు ఉంటాయి. అమెరికన్ జర్నల్ సొసైటీ ఆఫ్ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్‌లు ఉన్నాయట.