English | Telugu

కరోనా కంటే జగరోనా డేంజరస్: లోకేష్ 

వైసీపీ పాలనలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. బాబు ఉంటేనే జాబు అని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పిన విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందన్నారు. 10 నెలల తుగ్లక్ పాలనలో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. ఉన్న కంపెనీలను తరిమేశారని వస్తా అన్న కంపెనీలను వద్దన్నారని ఆరోపించారు. ఆఖరికి ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసి ఆకలేసి కేకలేసే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరోనా కంటే ప్రమాదకరమైన జగరోనా వైరస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యాలని ప్రయత్నించింది. దౌర్జన్య పర్వం, అరాచక వాదంతో స్థానిక సంస్థలను వశం చేసుకోవాలని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు," అంటూ ట్వీట్ చేసిన లోకేష్, " ఐపీఎస్ అధికారులను కోర్టు ముందు నిలబెట్టారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం అయ్యారు. నియంత ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది " అని స్పష్టం చేశారు.