English | Telugu

తాళం తీసింది నేనే.. దొంగ మాత్రం ఆయనే!

మాట్లాడింది నేనే.. కంటెంట్ నాది కాదు.. పోలీసుల విచారణలో శ్యామల

వైసీపీలో అధినేత నుంచి అధికార ప్రతినిథి వరకూ అందరూ స్క్రిప్ట్ రీడర్లే తప్ప.. వారి వద్ద ఒరిజినల్ కంటెంట్ లేదన్న సెటైర్లు పేలుతున్నాయి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. అందులో ఏముంది? ఆ ఉన్నదాంట్లో వాస్తవమేంటి? అన్న విషయంతో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ ఎవరూచూడలేదు. అధికారంలో ఉన్నప్పుడూ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడింది లేదు. ఇక బహిరంగ సభలో అయితే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేయడమే చూశాం. అది కూడా గడగడా కాదు.. తడబడుతూ, నట్టుతూ నిమిషనిమిషానికీ ముందున్న పేపర్లు చూసుకుంటూ చదవడమే. అయితే బహిరంగ సభల్లో ఆయనకు ఉన్న వెసులుబాటు ఏంటంటే.. మీడియా ప్రతినిథులు ప్రశ్నలు వేయరు. వేయలేరు. దాంతో ఆయన చదవాల్సిది చదివేసి వెళ్లిపోయేవారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయక తప్పని సరిపరిస్థితి. అప్పూడూ అంతే తాను చదవాల్సింది చదివేసి ప్రశ్నల వేసే అవకాశం విలేకరులకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ముగించేస్తున్నారు.

ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తాను మట్లాడాల్సింది మాట్లాడేసి.. అదే ఫైనల్ అన్నట్లుగా ముగించేయడం తెలిసిందే. ఒక సందర్భంలో తాను మాట్లాడుతుంటే మధ్యలో ప్రశ్నలు వేయవద్దు ఫ్లో దెబ్బతింటుందంటూ మీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం అన్న సంగతి కొత్తేం కాదు. అందరికీ తెలిసిన సంగతే. అందుకే జగన్ ప్రసంగాలలో విషయం అంటే అతిశయం, ఆడంబరం ఎక్కువగా ఉంటాయి. అందుకు కారణం ఆయన ప్రసంగంలో విషయం ఏమిటన్నది ఆయనకే పెద్దగా తెలియకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకే తరచుగా జగన్ స్క్రిప్ట్ రీడింగ్ ప్రసంగాలన్నీ బూమరాంగ్ అవ్యడమో నవ్వుల పాలు కావడమో జరుగుతుంటాయంటారు. ఇప్పుడు తాజాగా తేలిన విషయమేంటంటే.. జగన్ పార్టీలో కీలక పదవులు, పొజిషన్ లలో ఉన్న చాలా మంది పరిస్థితీ అదేనని. వైసీపీ ప్రసంగీకులలో చాలా మంది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి తమ భుజాలు తామే చరిచేసుకుంటారని ఆ పార్టీ అధికార ప్రతినిథి తేటతెల్లం చేశారు. అదెలాగంటే.. ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై వైసీపీ అధికార ప్రతినిథి విమర్శలు గుప్పించేశారు. ఆ బస్సు డ్రైవర్, అతడి సహాయకుడూ కూడా బెల్టు షాపులో తప్పతాడి బస్సెక్కారనీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం హయాంలో బెల్టు షాపులు తామరతంపరగా వెలిశాయనీ, అదే కర్నూలు బస్సు దుర్ఘటనకు కారణమని ఆరోపణలు చేశారు. దీంతో బస్సు ప్రమాద ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ.. పోలీసులు శ్యామల సహా 27 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలను సోమవారం (నవంబర్ 3) విచారణకు పిలిచారు. ఆ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాథానం చెప్పడంలో తడబడ్డారని తెలిసింది.

మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగి బస్సు నడిపారనడానికి ఆధారాలేంటి అన్న ప్రశ్నకు శ్యామల సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని తెలిసింది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలేమిటన్నది తనకు తెలియదనీ.. వైసీపీ అధికార ప్రతినిథిగా పార్టీ తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ను తాను చదివాననీ అంగీకరించేసినట్లు సమాచారం. అయితే విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్యామల ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా భయపడేది లేదని చెప్పుకొచ్చారనుకోండి అది వేరే సంగతి.