కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మీడియాలో వస్తున్న ఉదంతాలను సుమోటాగా స్వీకరించిన న్యాయస్థానం.. విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల తమవారి చివరి చూపునకు కూడా బంధువులు నోచుకోలేని పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను భద్రపరచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య 7,000 నుంచి 5,000 కు అమాంతం ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించింది. మే నెలతో పోల్చుకుంటే జూన్ లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. కరోనా విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు ఏమాత్రం పాటించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని.. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.