ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఫలితాలను మనం విడుదల చేశామన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఓ చరిత్రాత్మకం అని తెలిపారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. సెకండియర్ పరీక్షలకు 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో 2,76,389 పాస్ అయ్యారని తెలిపారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా సాధించారు. ఇక, జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.