English | Telugu
రాజకీయ పార్టీలపై సుప్రీం సీరియస్.. అభ్యర్థుల నేర చరిత్రను వెబ్‌సైట్లో పెట్టండి!
Updated : Feb 13, 2020
నేర చరిత్ర ఉన్న వాళ్లను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడంపై.. అన్ని రాజకీయ పక్షాలకు సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 'రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల నేర చరిత్రను సమగ్ర సమాచారంతో పార్టీల అధికారిక వెబ్‌సైట్లతో పాటు, మీడియా ద్వారా దేశ ప్రజలకు అందుబాటులో ఉంచాలి' అని గురువారం ఆదేశాలు జారీ చేసింది.48 గంటల్లోనే వారి వివరాలను వెబ్‌సైట్లలో పెట్టాలనిధర్మాసనం ఆదేశించింది.జస్టిస్ రోహిన్‌టన్ ఎఫ్. నారిమన్ సారథ్యంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. అంతేకాకుండా అభ్యర్థుల కేసుల సంఖ్య, చేసిన నేరాలతో పాటు, అవి ఏయే దశల్లో విచారణలో ఉన్నవి కూడా.. న్యూస్ పేపర్లు, సోషల్ మీడియా, అధికారిక వెబ్‌సైట్లలో పెట్టాలని ఆదేశించింది. ప్రజలు అభ్యర్థులను సులువుగా ఎన్నుకోవడం కోసం, ఈ ప్రక్రియ దోహదపడుతుందని సుప్రీం పేర్కొంది.
అసలు నేర చరిత్ర ఉన్న వారికి టిక్కెట్లు ఎందుకివ్వాల్సి వచ్చిందో అన్న విషయాన్ని కూడా వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. అభ్యర్థి ఎన్నికైన మూడు రోజుల్లోనే ఈ వివరాలను ఎన్నికల సంఘానికి కూడా సమర్పించాలని నిబంధన విధించింది. వీటికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించకపోయినా, లేదా వెబ్‌సైట్లో పెట్టకపోయినా కోర్టు ధిక్కరణ కింద అభ్యర్థిపై ఈసీ చర్యలు సైతం తీసుకోవచ్చని సుప్రీం సూచించింది.
తాజా గణాంకాల ప్రకారం.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మందిలో 233 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 2009లో ఎంపీలపై ఉన్న క్రిమినల్ కేసుల కంటే, ఇవి 44 శాతం ఎక్కువ. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఏడాదికేడాది నేర చరిత్ర ఉన్న వారి సంఖ్య తగ్గాల్సింది పోయి, మరింత ఎక్కువ మంది అలాంటి వాళ్లనే అభ్యర్థులుగా ఎందుకు పెడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఇలా నేర చరిత్ర ఉన్నవారికి కాకుండా, ప్రజలకు మంచి చేసేవారిని అభ్యుర్థులుగా ఎంపిక చేస్తారేమో చూడాలి.