English | Telugu

ముందు నీ రెండో భార్యకు న్యాయం చెయ్.! పవన్ పై వైసీపీ నిప్పులు

అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే, ఇక న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం నిష్‌ ప్రయోజనమన్నారు పవన్. అయితే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి రేప్ అండ్ మర్డర్ పై ఆనాడు గళమెత్తని పవన్ కల్యాణ్... ఇప్పుడు సడన్ గా ఆందోళన చేయడమేంటనే అనుమానాలు కలుగుతున్నాయి. సుగాలి ప్రీతి ఇష్యూను ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనుక జనసేనాని వ్యూహం ఉందంటున్నారు. ఎందుకంటే, అమరావతిలోనే రాజధాని కొనసాగాలని, మూడు రాజధానులను వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ కు రాయలసీమ వాసులు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించే సుగాలి ప్రీతి ఇష్యూను ఎత్తుకున్నారని అంటున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకించడమంటే, కర్నూలులో న్యాయ రాజధానిని కూడా వ్యతిరేకించినట్లే... అందుకే, పవన్ కు వ్యతిరేకంగా కర్నూలులో కొన్ని సంఘాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి. రాయలసీమ ద్రోహి పవన్‌ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఒకప్పుడు కర్నూలే రాజధానిగా ఉండాలన్న పవన్, ఇఫ్పుడు మాట మార్చారంటూ నిలదీశారు. ఇది కర్నూలు ప్రజలను మోసగించడమేనంటూ ప్రశ్నించారు. అందుకే, పవన్ తెలివిగా సుగాలి ప్రీతి ఇష్యూను ఎత్తుకుని, రాయలసీమలో ఎంటరవడమే కాకుండా... ఒక షెడ్యూల్‌ తెగకు చెందిన యువతి కుటుంబానికి న్యాయం చెయ్యని జగన్‌ ప్రభుత్వం, ఇక జ్యూడిషియరీ రాజధానిగా, కర్నూలును ప్రకటించడం నిష్‌ ప్రయోజనమంటూ జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. అలా, ఏదోఒక ప్రజాసమస్యను ఎత్తుకుని రాయలసీమలో పార్టీని బలోపేతం చేయాలన్నదే పవన్ వ్యూహమని జనసైనికులు చెబుతున్నారు. అందుకే సెంటిమెంట్‌ రగిలించే సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ, కర్నూల్లో పెద్దఎత్తున పవన్‌ ర్యాలీ, సభ నిర్వహించారని విశ్లేషకులంటున్నారు.

అయితే, సుగాలి ప్రీతి హత్యాచారం ఘటనపై ఉద్యమిస్తానంటున్న పవన్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు వైసీపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 2017లో ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని, నాడు టీడీపీ ప్రభుత్వముందని, మరి నాడెందుకు పవన్ ప్రశ్నించలేదని అంటున్నారు వైసీపీ లీడర్లు. ఇక, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అయితే పవన్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. 2017లో కర్నూలు విద్యార్థినిపై హత్యాచారం జరిగిందని, అప్పటి సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేదని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. నాడు జరిగిన నేరంపై నేడు పవన్ గగ్గోలు పెట్టడం అర్ధం లేదన్నారు. ఆడబిడ్డల భద్రత గురించి మాట్లాడుతున్న పవన్ తో అతడి రెండో భార్య రేణు దేశాయ్ ఎన్ని కష్టాలు పడిందో అందరీకి తెలుసు అన్నారు.

మొత్తానికి మూడు రాజధానుల ఇష్యూ నేపథ్యంలో, రాయలసీమలో అడుగుపెట్టడం కష్టమని భావించిన పవన్, ఇతర అంశాలతో ఎంటర్‌కావాలన్న వ్యూహంలో భాగంగా, ప్రీతి ఘటనతో ర్యాలీ చేశారని, కొందరు విశ్లేషకులంటున్నారు. మరి, ఈ వ్యూహాలు జనసేనకు ఊపునిస్తాయయో? లేదో? కాలమే సమాధానం చెప్పాలి.