English | Telugu

అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు వెనుక కారణాలు ఏంటి?

దేశ చరిత్రలోనే అతి పెద్ద తీర్పు. ఎప్పుడెప్పుడా అనుకుంటూనే ఆరు తరాల కాలం గడిచిపోయింది. భూమి గురించి మొదలైన గొడవ కాస్త రెండు మతాల మధ్య వివాదంగా మారింది. మాదంటే మాది అంటూ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాగ్వాదాలకి నేడు తెర పడింది.

అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. జస్టిస్ గోగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ప్రకటించారు. కోర్టు హాలు నెం.1 లో ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు సమావేశం అయ్యారు. కేంద్ర నుండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా, రాజీవ్ ధావన్‌లు హాజరయ్యారు.

మొట్టమొదటిగా అయోధ్య కేసులో భాగంగా వివాదాస్పద భూమి తమదేనంటూ షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్‌ అనర్హమైందంటూ ఏకాభిప్రాయంతో కొట్టివేసినట్లు వెల్లడించారు. బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించారో సరైన ప్రాతిపదిక లేనందున.. బాబర్ కాలంలోనే మసీదు నిర్మించినట్లుగా పరిగణలోకి తీసుకుంటూ.. మత గ్రంథాలను ఆధారం చేసుకుని కోర్టు తీర్పు ఇవ్వదని స్పష్టం చేశారు జస్టిస్ గొగోయ్. కానీ నిర్ణయం తీసుకునే ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని.. వివాదాస్పద స్థలంపై ఎవ్వరికి యాజమాన్య హక్కు లేదని స్పష్టం చేశారు.

ఆ స్థలంలో ముందుగా మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని.. అందుకుగాను అది వాదించిన న్యాయమూర్తులు రామ్‌లల్లా, విరాజ్‌మాన్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మసీదు నిర్మాణం జరిగినా.. ఎప్పుడు కట్టారు ? ఎవరు కట్టారు? అనే అంశాలు స్పష్టం కానట్లుగా హైకోర్టు తీర్పులో ఉందని సుప్రీం న్యాయమూర్తి గోగోయ్ చెప్పారు.

అయోధ్య రాముడి జన్మభూమిగానే భావిస్తున్నామని.. ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేదని జస్టిస్ గొగొయ్ అన్నారు. నమ్మకం, మత విశ్వాసాలు ఆధారంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వలేదని.. అందులో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిపారు.

అయోధ్య వివాదాస్పద స్థలంలో న్యాయసూత్రాల ఆధారంగా ఇకపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా భూ యాజమాన్య హక్కులు నిర్ణయించాలని కోరారు.

ఇక వివాదాస్పద స్థలాన్ని ఇరువురికి పంచే ప్రసక్తేలేదని.. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఎక్కడైనా ఐదు ఎకరాల భూమిని ముస్లింలకు కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు మూడు నెలల్లోగా అప్పగించాలని తీర్పును వెల్లడించింది ధర్మాసనం. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.