English | Telugu

అయోధ్య తుది తీర్పు.. సంతృప్తికరంగా లేదు.. కానీ?

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం.. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని.. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీం సూచించింది. అదేవిధంగా అయోధ్యలో మసీదు నిర్మాణానికి.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

కాగా, సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని అన్నారు. కానీ తీర్పుని గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని, ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ చెప్తా అన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని సయ్యద్ విజ్ఞప్తి చేశారు.