English | Telugu

అలహాబాద్ హైకోర్టు తీర్పుని తప్పుబట్టిన సుప్రీం... తుది తీర్పు ఏంటంటే?

అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ తీర్పును చదువుతూ... రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని అన్నారు. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పు ఇచ్చారన్నారు. బాబ్రీ నిర్మాణంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయన్న పురావస్తు శాఖ వాదనలను తోసిపుచ్చలేమని తెలిపారు. కానీ అది రామాలయమని పురావస్తు శాఖ ఆధారాలు చూపలేదన్నారు. అయితే అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని గొగోయ్ అన్నారు.

బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని అన్నారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వెల్లడించారు. మొగల్ చక్రవర్తి బాబర్ దగ్గర పని చేసిన సైనికాధికారులు మసీదును నిర్మించారని అన్నారు. అదేవిధంగా, బాబ్రీ మసీదు కూల్చివేత సరైనదని కాదని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముస్లింలకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఆదేశించారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.