English | Telugu
పాలమూరుకు కొత్త పరిశ్రమలు.. 480 ఎకరాల్లో ఐటీ హబ్
Updated : Nov 1, 2019
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా ప్రతిష్టాత్మక పాలమూరులో ఐటి మరియు మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు తొలి అడుగు పడనుంది. దివిటిపల్లి సమీపంలో సేకరించిన 480 ఎకరాల భూమిలో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ టవర్ పనులకు తొలి అడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా 25 కోట్ల నిధులు విడుదల చేయడంతో టీఎస్ ఐఐసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పూర్తిగా 5 అంతస్థుల్లో నిర్మించే ఈ టవర్ లో ప్రస్తుతానికి జీ ప్లస్ టు నిర్మాణాన్ని చేపడతారు. అందులో దాదాపు 50,000 అడుగుల విస్తీర్ణంలో స్పేస్ ను కంపెనీలకు అప్పగిస్తారు. ఆ స్పేస్ లో కంపెనీలు.. ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. తదనంతరం అవే కంపెనీలకు వారు అడిగినంత మేరకు స్థలాన్ని కేటాయించి కంపెనీల నిర్మాణాన్ని రెండో దశలో చేపడతారు. ముఖ్యంగా ఈ కారిడార్ లో సాఫ్ట్ వేర్ ఆధారిత కంపెనీలతో పాటుగా ఐటి, కంప్యూటర్ హార్డ్ వేర్, కాలుష్య, రసాయన రహిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేసి సుమారు నలభై కంపెనీల కార్యాలయాలను నెలకొల్పేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి దశలో కేవలం సాగు నీటి కల్పనకు పెద్ద పీఠ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు పారిశ్రామికాభివృద్ధికి నడుం బిగించింది. పాలమూరులో ఇప్పటికే జడ్చర్ల వద్ద ఉన్న సెజ్ ద్వారా కొంత పారిశ్రామిక ఉపాధి కలుగుతుంది. కానీ అక్కడ చాలా మంది ఇతరప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉండటంతో స్థానికంగా ఎక్కువ ఉపాధి పొందలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది.అందువల్ల పాలమూరులోని మరో ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా దివిటిపల్లి శివారులో చాలా భూమి ఉందని దాన్ని దాదాపు 30 ఏళ్ల క్రితం పలువురు రైతులకు అసైన్డ్ చేసిన కూడా ఎలాంటి వ్యవసాయం జరగలేదని గుర్తించారు. నిబంధనల ప్రకారమైతే సదరు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే తిరిగి తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపు 30 ఏళ్లుగా ఇదే భూమిలో ఏనాటికైనా నీటి వసతి కలుగుతుందని ఎదురు చూస్తున్న రైతులున్నారు. వారిని ఉన్నపళంగా పంపించటంపై ప్రభుత్వం పునరాలోచించి..వారికి సాధారణంగా భూ సేకరణలో ఎంతైతే పరిహారం వస్తుందో అంతే పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.ఒక్కో ఎకరానికి 12లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడంతో రైతులు కూడా స్వచ్ఛందంగానే వారి భూములను ప్రభుత్వానికి అప్పగించారు.
సేకరించిన భూమిలో గత ఏడాది మార్చి 14 న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి అంచున నిలుపుతామని ప్రకటించారు. కానీ ఎన్నికల కారణాల వల్ల జాప్యం జరిగింది. సుదీర్ఘ జాప్యం తర్వాత తొలి అడుగుకు అంతా సిద్ధం చేశారు. ఐటీ కారిడార్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న ప్రతిభావంతులైన యువతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఐటీ టవర్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సాఫ్ట్ వేర్ మరియు పారిశ్రామికంగా అభివృద్ధి జరగటం జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. గతంలో ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి లేక వలసలు పోయే వారని కానీ ఇప్పుడు ఇంతటి పరిశ్రమలు స్థానికంగా వస్తుండటంతో తమ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.