English | Telugu

ఆర్టీసీ సమ్మెపై రేపు తుది నిర్ణయంతీసుకోనున్న కేసీఆర్

ఆర్టీసీ కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చెయ్యనున్నారు. ఛలో కరీంనగర్ పిలుపుతో తమ డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం దిగొచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సమ్మె, ఆర్టీసి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఈరోజు హై కోర్టు విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పును బట్టి రేపటి మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీతో పాటు మరి కొందరు అధికారులు విచారణకు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి కోర్టు తీర్పుకు అనుగుణం గానే రేపు మధ్యాహ్నం జరిగే మంత్రి వర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ దీనిపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది.

సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు పదేపదే సమ్మెకు వెళ్లకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లో ఏవి తీర్చగలిగినవి..ఏవి తీర్చలేనివి.. సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి తదితర అంశాల పై రేపు మంత్రి వర్గం చర్చించనుంది. ఆర్టీసి భవితవ్యంపై నిపుణులతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు కేంద్రం అమలు చేస్తున్న రవాణా చట్టంపైనా సీఎం సమగ్ర అధ్యయనం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిని క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం.