English | Telugu

శివసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు: సంజయ్ రౌత్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. మిత్రపక్షాలు బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. 50-50 ఫార్ములా విషయంలో వెనక్కి తగ్గేది లేదంటుంది సేన. అహంకారం తగ్గించుకుని మెట్టు దిగాలని మిత్ర పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాజాగా సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరో కీలక ప్రకటన చేశారు, సేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వ్యాఖ్యానించారు.

బీజేపీ, శివసేన కూటమికి మరాఠా ప్రజలు పట్టం కట్టారని, అది జరగని పక్షంలో టు థర్డ్ మెజార్టీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని స్పష్టం చేశారు. నిన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు సంజయ్ రౌత్. తెల్లారే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన మొండిపట్టు పట్టడంతో బీజేపీ కూడా ప్రత్యామ్నాయాల కోసం తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే స్వతంత్రులు చిన్న పార్టీలకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించారు.

మొత్తం ఇరవై ఏడు మందిలో పదిహేను మందికి పైగా బిజెపిని సపోర్ట్ చేస్తూ లేఖలు కూడా ఇచ్చారు. మరోవైపు శివసేన ఎన్సీపీ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఎవరెవరుతో కలుస్తారు, మోదీ, షా ఎలా చక్రం తిప్పుతారు, ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు జరుగుతుంది అనే అంశాలపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది.