English | Telugu
మిథున్ రెడ్డి కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
Updated : Sep 17, 2025
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు దూకుడుగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టైన వారిలో ముగ్గురికి బెయిలు వచ్చినా.. కీలకమైన వారు ఇప్పటికీ బెయిలు లభించక రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులు అయిన రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు. తనకు సన్నిహితులైనప్పటికీ జగన్ ఇప్పటి వరకూ వీరిని జైలుకు వెళ్లి పరామర్శించలేదు.
అది పక్కన పెడితే.. ఈ కేసులో ఏ4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు బెయిలుపై వెళ్లి తిరిగి వచ్చి రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ తరుణంలో సిట్ మిథున్ రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.